Sai Priya Case: విశాఖలోని ఆర్కే బీచ్ లో అదృశ్యం అయిన సాయిప్రియ కేసులో నెల తరువాత ట్విస్ట్ జరిగింది. బీచ్‌లో కనిపించకుండా పోయి బెంగళూరుతో ప్రియుడితో ప్రత్యక్షం కావడం తెలిసిందే. అయితే ఈ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఆమె ప్రభుత్వ ధనంతో పాటు సమయాన్ని వృథా చేసినందుకు అలాగే కట్టుకున్న భర్తను మోసం చేయడం, అతడికి విడాకులు ఇవ్వకుండా మరో వ్యక్తిని పెళ్లి వివాహం చేసుకోవడంతో కోర్టు అనుమతి, ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 420, 417, 494, 202 రెడ్ విత్ 34 కింద సాయిప్రియ ఆమె ప్రియుడు రవితేజలపై కేసు రిజిస్టర్ చేసినట్లు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. అయితే తన యోగ సమాచారం తెలపాల్సిన బాధ్యత  ఉన్నప్పటికీ ఆమె దాచి పెట్టిందని అన్నారు. అందుకే ఆమె, ఆమె ప్రియుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు. 




అసలేం జరిగిందంటే..?


ఆగస్టు 25వ తేదీన విశాఖ ఆర్కే బీచ్ కు సాయి ప్రియ తన భర్త శ్రీనివాస రావుతో కలిసి వెళ్లింది. చాలా సేపు అక్కడే ఇద్దరూ సరదాగా గడిపారు. ఇంటికి వెళ్దామనుకున్న సమయంలో కాళ్లు కడుక్కొని వస్తానని చెప్పి సాయిప్రియ అలల వద్దకు వెళ్లింది. అప్పుడే శ్రీనివాస రావుకు ఫోన్ వచ్చింది. అతను ఫోన్ మాట్లాడి అటు చూసే లోపు ఆమె అక్కడ కనిపించలేదు. దీంతో తన భార్య సాయిప్రియ అలల్లో కొట్టుకుపోయిందని భావించిన ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సాయి ప్రియను వెతికేందుకు అధికార యంత్రాంగమంతా సముద్రతీరానికి చేరుకుంది. దాదాపు రెండ్రోజుల పాటు నేవీ అధికారులు హెలికాప్టర్, బోట్లు ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా గాలింపు చర్యలు జరుగుతుండగానే సాయిప్రియ తాను ప్రియుడితో వెళ్లిపోయినట్టు సమాచారం అందించి అందర్నీ షాక్‌కి గురి చేసింది.


బెంగళూరులో ప్రియుడితో ఉన్నానంటూ మెసేజ్..!


తాను ప్రేమిస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నానంటూ తన తండ్రికి ఆడియో మెసేజ్ పంపించింది. తన కోసం వెతకొద్దని... అలా చేస్తే చచ్చిపోతానంటూ వార్నింగ్ ఇచ్చింది. తనకు బతకాలని ఉందని... వెతికితే మాత్రం తన ప్రియుడితో కలిసి సూసైడ్ చేసుకుంటానని హెచ్చరించింది. అంతే కాకుండా బెంగళూరులో ప్రియుడితో పెళ్లి కూడా జరిగిపోయిందని మెడలో తాళిబొట్టుతో ఉన్న ఫొటోలను కూడా పంపింది. ఈ ఘటనకు తన తల్లిదండ్రులకు ఎలాంటి సంబంధం లేదని.. కాబట్టి వారిని ఎవరూ ఏం అనొద్దని తెలిపింది. అలాగే తనకోసం సమయం, డబ్బు వృధా చేసుకున్న అధికారులకు క్షమాపణలు కూడా చెప్పింది. 


అయితే సాయి ప్రియ గాలింపు కోసం అధికారులు సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. ముఖ్యంగా హెలికాప్టర్ సాయంతో గాలింపు చేపట్టడంతో ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సమయంతో పాటు, డబ్బులు వృథా అయ్యేలా చేసిన సాయిప్రియపై అధికారులంతా కోపంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమెతో పాటు ఆమె ప్రియుడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.