Bus Conductor Attacked On Retired IAS Officer In Jaipur: చిన్న చిన్న విషయాలకే కొందరు విచక్షణ కోల్పోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఓ బస్ కండక్టర్ కేవలం రూ.10 కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపైనే దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జైపూర్‌లో (Jaipur) చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 75 ఏళ్ల రిటైర్డ్ ఐఏఎస్ ఆర్.మీనా ఆగ్రా రోడ్డులోని కనోటా బస్టాప్ వద్ద దిగాల్సి ఉంది. అయితే, కండక్టర్ ఆ విషయాన్ని చెప్పకపోవడంతో డ్రైవర్ ముందుకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో బస్సు తర్వాతి స్టాప్‌లో ఆగింది. దీంతో బస్ కండక్టర్, విశ్రాంత ఐఏఎస్ మధ్య వాగ్వాదం జరిగింది. అదనపు ఛార్జీ కింద రూ.10 చెల్లించాల్సిందేనని కండక్టర్ స్పష్టం చేశాడు. దీనికి రిటైర్డ్ ఐఏఎస్ మీనా నిరాకరించారు.

వృద్ధుడని కూడా చూడకుండా..

ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి కండక్టర్ తొలుత మీనాను నెట్టేశాడు. దీంతో మాజీ అధికారి అతన్ని చెంప దెబ్బ కొట్టాడు. ఆగ్రహంతో ఊగిపోయిన కండక్టర్ వృద్ధుడని కూడా చూడకుండా రిటైర్డ్ ఐఏఎస్‌పై తీవ్రంగా దాడి చేశాడు. బస్సులోని మిగతా ప్రయాణికులు వారిని ఆపేందుకు యత్నించారు. ఈ తతంగాన్ని బస్సులో ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై మీనా పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన కండక్టర్ ఘన్‌శ్యామ్ శర్మగా గుర్తించారు. ప్రయాణికుడిపై దాడి చేసినందుకు సదరు కండక్టర్‌ను జైపుర్ సిటీ ట్రాన్స్‌పోర్ట్ సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read: Maha Kumbh 2025: అడ్డమైన ప్రశ్న అడిగాడని యూట్యూబర్‌ను చితబాదిన బాబా - మహాకుంభమేళాలో వైరల్ వీడియో