Bullet Bandi Ashok : " బుల్లెట్ బండి ఎక్కి వచ్చేత్త పా" పాటతో పాపులరైన జంట అశోక్ , సాయి ప్రియ. డాన్స్‌తో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది సాయిప్రియ. ఇప్పుడు అశోక్‌ కు కూడా అలాంటి ఫేమ్ వచ్చేసింది. కాకపోతే డాన్స్ చేసి కాదు. అవినీతి చేసి. ఏసీబీ అధికారులకు రెడ్  హ్యాండెడ్‌గా పట్టుబడి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. అశోక్  రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు  బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానర్‌గా పనిచేస్తున్నాడు అశోక్. ఓ ఇంటి పర్మిషన్ కోసం రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు అశోక్. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించగా.. వలపన్ని పట్టుకున్నారు.  


లంచం కోసం ఆశపడిన బుల్లెట్ బండి ఫేమ్ పెళ్లికొడుకు అశోక్ 


మంచిర్యాల జిల్లా జన్నారం మండలంకు చెందిన అశోక్ కష్టపడి చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. పెళ్లి చేసుకున్న తర్వాత  హైదరాబాద్ వచ్చి నిధుల్లో చేరారు. అయితే సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపు ఆయనకు సన్నిహితుల్లో ఓ స్టార్‌గా నిలబెట్టాయి.  నిజానికి అశోక్ ఎలాంటి డాన్స్ చేయలేదు. ఆ వర్జినల్ పాటలో పెళ్లి కొడుకు అసలు లేడు. కానీ ఇక్క బారాత్ వేడుకలో ఆయన భార్య సాయి ప్రియ మంచి ఈజ్‌తో డాన్స్ చేసింది.. ఆమె ఎదురుగా అశోక్ ఉన్నాడు కాబట్టి.. ఇద్దరిది చూడముచ్చటైన జంట అని మంచి  పబ్లిసిటీ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిశారు.  


రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో తలవంపులు


అయితే తమకు  వచ్చిన గుర్తింపు కారణంగా వారు సోషల్ లైఫ్‌లో మరంత జాగ్రత్తగా ఉండాల్సింది. తమ  గురించి ఎలాంటి బ్యాడ్ న్యూస్ బయటకు వచ్చినా సోషల్ మీడియా ఆ విషయాన్ని హైలెట్ చేస్తుందని గుర్తించలేకపోయారు. టౌన్ ప్లానింగ్ అంటేనే లంచాల మయం. అందులో టౌన్ ప్లానర్‌గా ఉన్న అశోక్ .. ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సింది. మామూలుగా ఓ ఉద్యోగి పట్టుబడితే.. ఏసీబీకి పట్టుబడిన ఉద్యోగి అని ప్రచారం చేసి వదిలేస్తారు. కానీ అశోక్ విషయంలో జరిగేది అది కాదు. ఆయనకు ఇంతకు  ముందు వచ్చిన ఫేమ్ కారణంగా విస్తృతంగా ప్రచారం చేస్తారు. అది కుటుంబ పరువును సోషల్ మీడియాకు ఈడుస్తుంది. ఇప్పుడు జరిగింది అదే. 


వచ్చిన గుర్తింపు కారణంగా ఇప్పుడు మరింతగా బ్యాడ్ 


తనకేం సంబంధం లేదని.. కుట్ర చేశారని అశోక్ వాదించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. లంచం తీసుకుంటూండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇప్పుడు ఈ అంశం బుల్లెట్ బండి పాటంత వేగంగా వైరల్ అవుతోంది. ఆయన సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. సమాజంలో గౌరవంగా బతకాలంటే .. అదీ కొంత గుర్తింపు వచ్చిన తర్వాత మరింత బాధ్యతగా ఉండాలి. ఆ విషయాన్ని ఈజీ మనీ కోసం అశోక్ మర్చిపోయాడు. ఏసీబీకి చిక్కాడు.