Hyderbad News: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువుల పెళ్లి చూడడానికి వచ్చి అన్నదమ్ములు మృత్యువాత పడ్డారు. మరో యువకుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటన ఉప్పల్ ప్రాంతంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..  జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని రామవరానికి చెందిన మేటి రాములు-రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడైన అరుణ్‌కు వివాహం జరగ్గా రెండో కుమారుడైన శ్రవణ్‌(29) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. మూడో కుమారుడు శివ(27) రెండు నెలల క్రితం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో హౌస్‌ సర్జన్‌ జూనియర్‌ డాక్టర్‌గా విధుల్లో చేరాడు.  


బంధువుల పెళ్లి చూడానికి శివ హైదరాబాద్‌కు వచ్చారు. ఇద్దరూ కలిసి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. శుభకార్యం అయిపోయాక ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో శ్రవణ్, శివ వాళ్ల కజిన్ భానుతో కలిసి బైక్‌పై పీర్జాదిగూడ నుంచి ఉప్పల్ వెళ్తూ, ఓ డివైడర్ వద్ద యూటర్న్ చేస్తుండగా బొలేరో ఢీకొట్టింది. ఘటనలో శివ, శ్రవణ్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన భానును ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. 






కుటుంబంలో తీవ్ర విషాదం
రాములు - రాజేశ్వరి దంపతులు కష్టపడి తమ కుమారులను ఉన్నత చదువులు చదివించారు. ముగ్గురు కుమారులను ప్రయోజకులను చేశారు. తమ కుటుంబంలో ఒక ఇంజినీర్, ఒక డాక్టర్ ఉండాలని ఆశపడ్డారు. శ్రవణ్‌‌ను ఇంజినీరింగ్ చదివించగా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. శివను జార్జియా దేశానికి పంపి మెడిసిన్‌ పూర్తి చేయించారు. ఇండియాలో వైద్యవృత్తి చేపట్టేందుకు అవసరమైన అర్హత పరీక్షలు పూర్తి చేసుకొని ఇటీవల ఎంజీంలో జూనియర్‌ డాక్టర్‌గా చేరాడు. చేతికందివచ్చిన కొడుకులు ఇద్దరు కళ్లముందే మృతదేహాలుగా పడి ఉండడంతో  తల్లిదండ్రుల రోదన అందరితో కన్నీరు పెట్టించింది. ఒకే రోజు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెండంతో గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. సోమవారం సాయంత్రం శ్రవణ్, శివ మృతదేహాలను రామవరం గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.