Andhra Pradesh Arogyasree scheme :  ఆరోగ్యశ్రీ సేవలను  బుధవారం నుండి నిలిపివేస్తున్నట్లు హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌వారు ప్రకటన విడుదల చేశారు. బుధవారం నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పెండింగ్‌ బకాయిలను విడుదల చేయలేదని ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వం రూ.1500 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని వెల్లడించింది. ఈ కారణంగా రేపటి నుండి ఆరోగ్య శ్రీ సేవలను ఆపేస్తున్నట్లు హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ ప్రకటనలో పేర్కొంది.              


గత ఆరు నెలల కాలంలో ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు రెండు, మూడు సార్లు ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నాయి.   ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి.  ఇప్పటికే మూడు సార్లు ప్రభుత్వానికి ఈ విషయంపై విజ్ఞప్తి చేశామని ఇంకా రూ. పదిహేను వందల  కోట్ల బకాయిలు ఉన్నాయని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి.  పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయకపోతే ఆస్పత్రుల నిర్వహణ సమస్యగా మారుతుందని వాపోతున్నారు.                                                                  


బిల్లులతో పాటు చికిత్సలకు ఇస్తున్న ప్యాకేజీల ధరలు కూడా పెంచాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు.  పదేళ్ల క్రితం ప్యాకేజీలతోనే ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నామని, శస్త్ర చికిత్సల ఛార్జీలు పెంచాలని ఆస్పత్రుల యాజమాన్యాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. గత చర్చల్లో పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం హామీలిచ్చినా.. బిల్లులు విడుదల చేయలేదని నెట్ వర్క్ ఆసుపత్రులు ఆరోపిస్తున్నాయి. బిల్లుల విడుదల, ఇతర డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆసుపత్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇలా హెచ్చరికలు జారీ చేసినప్పుడల్లా చర్చల్లో పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని, కొన్ని ప్యాకేజీల ఛార్జీలు పెంచుతామని ప్రభుత్వం ఆసుపత్రులకు హామీ ఇస్తూ వస్తోంది.                        


ఎన్నికలకు ముందు కూడా బిల్లులు ఇస్తారేమో అని ఎదురు చూశారు. ఇవ్వకపోవడంతో పోలింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు తమ బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు. పథకాల లబ్దిదారులకు రూ. పధ్నాలుగు వేల కోట్లు చెల్లించాల్సి ఉన్నా ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో చెల్లించలేదు. రూ. పదహారు వేల  కోట్లను  గత యాభై రోజుల్లో ఆర్బీఐ నుంచి అప్పుల రూపంలో ఏపీ ప్రభుత్వం తెచ్చిది. వా  టి నుంచి చెల్లిస్తారేమోనని ఆస్పత్రుల యాజమాన్యాలు భావిస్తున్నాయి. సేవలు నిలిపివేయడం ద్వారా ఒత్తిడి పెంచాలని  భావిస్తున్నాయి.