Road Accidents In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలోని కాకినాడలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందగా.. తెలంగాణలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లాలోని గండేపల్లి మండలం మురారి వద్ద రోడ్డుపై అదుపు తప్పి పడిపోయిన బైక్‌ను గుర్తు


తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందగా.. వారి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. భీమవరం మండలం తాడేరుకు చెందిన నంగలం దుర్గ (40)కు రాజు (18), ఏసు (18), అఖిల్ (10) ముగ్గురు కుమారులు. వీరి కుటుంబం కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పనుల్లో భాగంగా నర్సీపట్నం వెళ్లి బైక్‌పై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా.. ఆదివారం తెల్లవారుజామున గండేపల్లి మండలం మురారి శివారులో బైక్ అదుపు తప్పి కిందపడ్డారు.


ముగ్గురు స్పాట్ డెడ్


వీరు ఒక్కసారిగా కింద పడగా.. వెనుక నుంచి వచ్చిన వాహనం వీరి పైనుంచి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో రాజు, ఏసు, అఖిల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దుర్గకు తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నట్లు సీఐ లక్ష్మణరావు, ఎస్సై రామకృష్ణ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


తెలంగాణలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు


అటు, తెలంగాణలోని మేడ్చల్ వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మేడ్చల్ - శామీర్ పేట్ రాజీవ్ రహదారిపై అతివేగంతో కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తోన్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదం శుక్రవారం జరగ్గా.. దీనికి సంబంధించిన సీసీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదంలో గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగులుగా చేస్తోన్న మోహన్ (25), దీపిక (25) అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Tirupati News: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్టు, స్టేషన్ ముందు తండ్రి, వైసీపీ నేతల నిరసనలు - కాసేపటికి విడుదల