IndiGo Flight: ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో విమానానికి మంగళవారం ఉదయం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే అప్రమత్తమైన విమాన సిబ్బంది, అధికారులు.. ప్రయాణికులను ఎమర్జెన్సీ మార్గం ద్వారా కిందకు దించారు. అనంతరం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 176 మంది ప్రయాణికులతో ఇండిగో విమానం వారణాసికి మంగళవారం ఉదయం బయలుదేరేందుకు సిద్ధమవుతోంది. విమానం బయలుదేరడానికి ముందు ఉదయం 5:40 గంటల సమయంలో బాంబు బెదిరింపుతో ఫోన్ కాల్ విమానాశ్రయ అధికారులకు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అధికారులు ఫ్లైట్ టేకాఫ్ కాకుండా ఆపడంతో పాటు ప్రయాణికులను అత్యవసర మార్గాలు గుండా కిందికి దించారు.
అనంతరం బాంబ్ స్క్వాడ్, ఇతర సెక్యూరిటీ సిబ్బంది ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఏజెన్సీ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన ప్రోటోకాల్స్ ను అనుసరించి విమానాన్ని రిమోట్ బేకు తీసుకెళ్లి తనిఖీలు నిర్వహించారు. దీనిపై స్పందించిన ఎయిర్పోర్ట్ అధికారులు.. ఉదయం 5:40 గంటలకు బాంబు బెదిరింపు గురించి ఫోన్ కాల్ వచ్చిందని, విమానంలోని టాయిలెట్ మీద బాంబ్ అనే రాసి ఉండడాన్ని సిబ్బంది గమనించారని వెల్లడించారు. టాయిలెట్ పై ఉంచిన కాగితంలో 30 నిమిషాల్లో బాంబు బ్లాస్ట్ అవుతుందని రాశారని అధికారులు వెల్లడించారు. ఫ్లైట్లో ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను అత్యవసరంగా కిందకు దించుతున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
గతంలోనూ ఈ తరహా బెదిరింపులు
ఇదే నెలలో ఇటువంటి బెదిరింపు కాల్స్ ఎయిర్పోర్ట్ సిబ్బందికి రావడం గమనార్హం. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఇండియా ఫ్లైట్లో బాత్రూమ్ వద్ద బాంబు అనే రాసి ఉన్న కాగితాన్ని గుర్తించారు. ఈ నెల 15వ తేదీన ఇది జరిగినట్లు తెలుస్తోంది. వడోదర వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలోని టాయిలెట్లో టిష్యూ పేపర్ పై బాంబ్ అని రాసి ఉండడాన్ని గుర్తించారు. తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఏమీ లేనట్లు నిర్ధారించారు. గతేడాది సెప్టెంబర్ లో 166 మంది ప్రయాణికులతో ముంబైకి వెళుతున్న అకాస విమానానికి కూడా సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు మెసేజ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ వారణాసి విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. పూర్తిస్థాయి తనిఖీలు అనంతరం ఎటువంటి బాంబు లేనట్టు తేలడంతో విమానం సురక్షితంగా ఉన్నట్లు ఏర్పాటు అధికారులు తేల్చారు. తాజాగా వచ్చిన బెదిరింపు కాల్ కు సంబంధించి విమానంలో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు పూర్తిస్థాయి సమాచారాన్ని బయటకు వెల్లడించాల్సి ఉంది. ఈ తరహా బెదిరింపు కాల్స్ వలన ప్రయాణికుల్లో ఆందోళన పెంచడంతోపాటు వారి సమయాన్ని వృధా చేసినట్లు అవుతుందని పలువురు పేర్కొంటున్నారు.