Maharastra News :  బెంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీ గుట్టుల గుట్టల నోట్ల కట్టలు పోగేసుకుని అడ్డంగా దొరికిపోయారు. ఈడీ పట్టుకున్న తర్వాత ఆయన వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్థా ఛటర్జీకి .. ఆయన సన్నిహితురాలి ఇళ్లల్లో దొరికిన నోట్ల కట్టల దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇలాంటి నోట్ల కట్టల దృశ్యాలే మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఈ సారి మహారాష్ట్రలో చోటు చేసుకుంది. 



మహారాష్ట్రలోని జల్నా జిల్లాలోని ఓ బిజినెస్‌ గ్రూప్‌పై ఆదాయపు పన్ను శాఖ ఇటీవల విస్తృతంగా సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాదాపు రూ.56 కోట్ల నగదు లభ్యమవ్వగా.. దీన్ని లెక్కించడానికి అధికారులకు ఏకంగా 13 గంటల సమయం పట్టిందట. దీంతో పాటు వందల కోట్ల విలువైన బినామీ ఆస్తులను అధికారులు గుర్తించారు. జల్నాలో స్టీల్‌, వస్త్రాలు, రియల్‌ ఎస్టేల్‌ వ్యాపారం చేసే ఓ సంస్థ గత కొన్నేళ్లుగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆదాయపు పన్ను శాఖకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఈ నెల 1 నుంచి 8 వరకు 260 మంది ఐటీ సిబ్బంది ఐదు బృందాలుగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఆ సంస్థ యజమాని ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిపారు.


ఈ సోదాల్లో మొత్తం రూ.56 కోట్ల నగదు, రూ.14 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను అధికారులు జప్తు చేసుకున్నారు. ఇతర ఆస్తులను చెందిన డిజిటల్‌ డేటా, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు మొత్తాన్ని అధికారులు ఐటీ ఆఫీసుకు తీసుకురాగా.. 13 గంటలకు పైగా శ్రమించి లెక్కించారట. ఈ సోదాల్లో దాదాపు రూ.390 కోట్ల మేర లెక్కల్లోకి రాని బినామీ ఆస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నోట్ల కట్టలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.



అయితే వీరిదంతా పన్నులు ఎగ్గొట్టి చేసే వ్యాపారమే కానీ రాజకీయాలతో సంబంధం లేదని భావిస్తున్నారు. ఈ అంశంపై ఐటీ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు. రాజకీయ లింకులు ఉంటే.. సంచలనాత్మకం అయ్యే అవకాశం ఉంది.