BJP leader son staged a fake death drama: ఆయన తండ్రి ఓ రాజకీయ నాయకుడు.  వ్యాపారం చేద్దామని బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకున్నాడు. నాలుగు లారీలు, రెండు బస్సులు కొని ట్రాన్స పోర్టు బిజినెస్ ప్రారంభించాడు. అయితే ఈఎంఐలు ఎందుకు  కట్టాలి ఎగ్గొడితే బెటర్ కదా అనుకున్నాడు. ఎలా ఎగ్గొట్టాలా అని ఆలోచిస్తే.. డెత్ సర్టిఫికెట్ సమర్పిస్తే రుణాలు మాఫీ అయిపోతాయనుకున్నాడు. అసలు అలాంటి ఆలోచన రావడమే అమాయకత్వం అనుకుంటే అమలు చేసేశాడు. మరి దొరకకుండా ఉంటాడా? మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో బీజేపీ నేత మహేష్ సోనీ కుమారుడు విశాల్ సోనీ కనిపించకుండా పోయాడు. కుటుంబసభ్యులు కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతని ఫోన్  ను ట్రాక్ చేస్తే ఓ చెరువులో ఉన్నట్లుగా తేలింది. అక్కడ  వెదికితే అతని కారు  బయటకు  వచ్చింది.  కానీ విశాల్ ఆచూకీ తెలియలేదు. దాంతో కారుతో పాటు మునిగి విశాల్ కూడా చనిపోయాడని మీడియాలో ప్రచారం  జరిగింది.  

ఎన్ని రోజులు చూసినా విశాల్ ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు అతని డిజిటల్ హిస్టరీపై కన్నేశారు. ఓ చోట ఆయన తన సీక్రెట్ ఫోన్ వాడుతున్నట్లుగా గుర్తించారు. మహారాష్ట్రలో ఉన్నట్లుగా గుర్తించి.. వెళ్లి పట్టుకున్నారు.   సంభాజీ నగర్‌లోని ఫర్డాపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో విశాల్‌ను పట్టుకున్నారు. ఆ సమయంలో అతను చినిగిపోయిన దుస్తులతో పిచ్చివాడి వేషంలో ఉన్నాడు. అక్కడ కూడా డ్రామా ఆడాడు.                                          

పోలీసులు పట్టుకోవడంతో చివరికి అసలు విషయం ఒప్పుకున్నాడు.  ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌కు 6 ట్రక్‌లు, 2 బస్సుల కోసం బ్యాంకుల నుంచి 1.40 కోట్లు అప్పులు తీసుకున్నాను. బ్యాంకులకు డెత్ సర్టిఫికెట్ ఇస్తే అప్పులు మాఫ్ అవుతాయని తెలుసు. అందుకే మరణం నాటకం ఆడానని అంగీకరించాడు.పోలీసులకు అతనిపై ఏమని  కేసు పెట్టాలో అర్థం కాలేదు. ఫేక్ డెత్ గేమ్ ఆడినందుకు  సెక్షన్లు లేనందున అతన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అతన్ని చూసి ఇప్పుడు కుటుంబసభ్యులంతా   నవ్వుతున్నారు. ఇలా ఎలా బ్యాంకుల్ని మోసం చేయాలనుకున్నావురా అని కామెడీ చేస్తున్నారు.