యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ హత్య ఉదంతం కప్పిపుచ్చడానికి నిందితులు చేసిన పని విస్మయం కలిగిస్తోంది. పక్కాగా అమలు చేసిన ఆ మాస్టర్ ప్లాన్, వారి మూడేళ్ల మాటలు సరిగ్గా రాని చిన్నారి వాంగ్మూలంతో బట్టబయలు అయింది. దీంతో పోలీసులు నిందితులు ఆ కోణంలో విచారణ జరిపి అసలు నిజాలను బయటికి లాగారు. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం నెరుపుతున్న ఓ భార్య తన భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి భర్తను చంపేసినట్లుగా పోలీసులు గుర్తించారు. పథక రచనలో భాగంగా బైక్‌ను ప్రియుడు నడుపుతుండగా మధ్యలో శవం, వెనుక భార్య కూర్చొని ఉండగా, ఆమె చేతిలో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. అలా వారు ఏకంగా 50 కిలో మీటర్లు ప్రయాణించారు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం అనంతారం సమీపంలో ఈ నెల 18న జాతీయ రహదారి వంతెన పైనుంచి కింద పడి మృతి చెందిన లకావత్‌ కొమ్రెల్లి అనే 32 ఏళ్ల వ్యక్తి హత్య అని పోలీసులు తేల్చారు. నిందితులైన కొమ్రెల్లి భార్య భారతి అలియాస్‌ సుజాత, ఆమె ప్రియుడు బానోత్‌ ప్రవీణ్‌ను అరెస్టు చేశారు. హత్య చేసినట్లుగా వారు ఒప్పుకున్నారని డీసీపీ మంగళవారం (సెప్టెంబరు 27) విలేకరుల సమావేశంలో వెల్లడించారు.


జనగామ జిల్లా నర్మెట్ట మండలం హన్మంతపురం గ్రామంలోని తీటుకుంటతండాకు చెందిన లకావత్‌ కొమ్రెల్లి - భారతికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం అయింది. ఆరేళ్ల క్రితం వీరు సికింద్రాబాద్‌ వచ్చి నామాలగుండులో జీహెచ్‌ఎంసీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు కూతుర్లు. ఇద్దరు బిడ్డలను జనగామలోని ఎస్టీ వసతి గృహంలో చేర్పించి చదివిస్తున్నారు. చిన్న కుమార్తె వారితోనే ఉంటోంది.


భారతికి రెండేళ్ల క్రితం బంధువుల పెళ్లి వేడుకలో డీజే ప్రవీణ్ పరిచయం అయ్యాడు. ఇద్దరు కలిసి వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. కొన్నాళ్లకి అనుమానం వచ్చిన భర్త అలాంటివి మానేయాలని హెచ్చరించాడు. దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని భారతి నిర్ణయించుకుంది. ఇటు భార్య వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాలనుకున్న భర్త కొమ్రెల్లి ఈ నెల 18న సొంతూరికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. భర్త లేకపోవడంతో ప్రియుడ్ని భారతి ఇంటికి రప్పించింది. వారిద్దరూ ఏకాంతంగా ఉండగా, కొమ్రెల్లి అదే రోజు రాత్రి ఇంటికి వచ్చి తన భార్య ప్రియుడితో కలిసి ఉండటాన్ని చూసి గొడవ పడ్డాడు. దీంతో భారతి, ఆమె ప్రియుడు ప్రవీణ్‌ కలిసి కొమ్రెల్లిని చున్నీతో ఉరేసి ఇంట్లోనే చంపేశారు.


బైక్ పైనే నలుగురూ ప్రయాణం
అదే రాత్రి ఎవరి కంటా పడకుండా శవాన్ని తీసుకొని భువనగిరి మండలం అనంతారం తీసుకెళ్లారు. ఆ సమయంలో ప్రియుడు బైక్ నడుపుతుండగా, భర్త శవం, భార్య వెనక ఉన్నారు. ఆమె చేతిలో మూడేళ్ల కుమార్తె ఉంది. అలా వారు 50 కిలో మీటర్లు ప్రయాణించారు. బైక్ తో సహా కొమ్రెల్లి మృతదేహాన్ని వంతెన పైనుంచి కిందకు తోసేశారు. పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ కి ఇది హత్య అనే అనుమానం రావడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. హత్య సమయంలో భారతి వద్దే ఉన్న మూడున్నరేళ్ల చిన్నారిని అడిగారు. ఇంట్లో గొడవ జరిగిందని, అమ్మ, మరో వ్యక్తి కలిసి తన నాన్నను చంపారంటూ ఆ చిన్న పిల్ల చెప్పిందని పోలీసులు తెలిపారు. నిందితులు లకావత్‌ భారతి, బానోత్‌ ప్రవీణ్‌ ను రిమాండ్‌కు తరలించినట్లుగా పేర్కొన్నారు.