Bengaluru woman became a one-sided love psycho : ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కు పదేపదే ప్రేమ ప్రతిపాదనలు చేస్తూ, బెదిరింపులకు పాల్పడిన మహిళపై ఆయనే ఫిర్యాదు చేయడం బెంగళూరు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. రామమూర్తి నగర పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సతీష్ జి.జె. ఈ ఫిర్యాదు దాఖలు చేశారు.
సంజనా అలియాస్ వనజా అనే మహిళ 2025 అక్టోబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు ఇన్‌స్పెక్టర్ అధికారిక ఫోన్ నంబర్‌కు వాట్సాప్ కాల్స్, మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ద్వారా నిరంతరం సంప్రదించింది. తాను గాఢంగా ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసింది. ఇన్‌స్పెక్టర్ స్పందించకపోవడంతో మహిళ తనను కాంగ్రెస్ కార్యకర్తనని చెప్పుకుని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హోం మంత్రి జి. పరమేశ్వర, మంత్రులు లక్ష్మీ హెబ్బాళ్కర్, మోతమ్మలతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని బెదిరించే ప్రయత్నంచేసింది. వారితో దిగిన ఫోటోలు కూడా పంపింది.
ఆమె ఏం చెప్పిందో కానీ హోం మంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాల నుంచి ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ కాల్స్ వచ్చాయి. సంజనా అనే మహిళ ఫిర్యాదు ఎందుకు తీసుకోవడం లేదని వారి కార్యాలయాల నుంచి వివరణ అడిగారు. అయితే ఆమె ఎప్పుడూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఇన్‌స్పెక్టర్ స్పష్టం చేశారు. నవంబర్ 11న మహిళ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఇన్‌స్పెక్టర్‌కు ఒక ప్యాకెట్ ఇచ్చింది. అందులో నిద్ర మాత్రలు, రెండు లేఖలు ఉన్నాయి. ఒక లేఖలో తన ప్రేమను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుని, దానికి కారణం ఇన్‌స్పెక్టర్ అని రాస్తానని బెదిరించింది. మరో లేఖ తన రక్తంతో రాశానని పేర్కొంది.
ఈ ఘటన తర్వాత ఇన్‌స్పెక్టర్ ముందస్తు ఫిర్యాదు చేసి, అధికారుల ద్వారా మహిళను హెచ్చరించేలా చర్యలు తీసుకున్నారు. కానీ ఆమె సహకరించలేదు. దర్యాప్తులో గతంలోనూ ఇలాంటి ప్రవర్తనతో ఇతర పోలీసు అధికారులను వేధించినట్టు తేలింది. డిసెంబర్ 12న మళ్లీ స్టేషన్‌కు వచ్చి గొడవ సృష్టించి, బెదిరింపులు జారీ చేసింది. దీంతో ఇన్‌స్పెక్టర్ అధికారికంగా ఫిర్యాదు చేశారు. రామమూర్తి నగర పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS) 2023లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది. పబ్లిక్ సర్వెంట్‌ను డ్యూటీ నిర్వహించకుండా అడ్డుకోవడం, క్రిమినల్ బెదిరింపు వంటి ఆరోపణలు ఉన్నాయి.