Bengaluru Techie Atul Subhash Wife Arrested: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బెంగుళూరు టెకీ అతుల్ సుభాష్ (Atul Subhash) ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అతుల్ భార్య నిఖితా సింఘానియాను ఆదివారం కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో నిఖితాను అరెస్ట్ చేయగా.. ఆమె తల్లి, సోదరున్ని యూపీలోని అలహాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరచి జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్లు ఓ ఉన్నతాధికారి ధ్రువీకరించారు. కాగా, తన భార్య వేధింపులు భరించలేక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తీవ్ర సంచలనం కలిగించింది.
కాగా, తన సోదరుడు అతుల్ సుభాష్‌ను.. అతని భార్య నిఖిత, ఆమె కుటుంబ సభ్యులు మానసికంగా వేధించి ఆత్మహత్యకు ఉసిగొల్పారని ఆరోపిస్తూ అతుల్ సోదరుడు అనురాగ్ బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. నిఖిత, ఆమె కుటుంబ సభ్యులతో కలిపి ఐదుగురిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ కోసం ఓ దర్యాప్తు బృందాన్ని బెంగుళూరు పోలీసులు జౌన్‌పూర్‌కు పంపారు. నిఖితతో పాటు ఆమె కుటుంబ సభ్యులను విచారించారు. ఈ క్రమంలో ఆదివారం వారిని అరెస్ట్ చేశారు.
40 పేజీల లేఖ
బెంగుళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్ సుభాష్ (34) భార్య వేధింపులు తాళలేక ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరణానికి ముందు ఆయన ఏకంగా 40 పేజీల లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడ్డట్లు పోలీస్ అధికారులు తెలిపారు. యూపీకి చెందిన ఆయన ఓ కంపెనీలో ఐటీ డైరెక్టర్‌గా పని చేస్తూ మారతహళ్లిలోని మంజునాథ లేఅవుట్‌లో ఉంటున్నారు. భార్యతో తాను అనుభవిస్తోన్న మానసిక క్షోభకు సంబంధించి లేఖ రాసి ఈ - మెయిల్ ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, తన కార్యాలయం అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులకు పంపించారు. అనంతరం తన నివాసంలోనే అర్ధరాత్రి ఉరి వేసుకుని మృతి చెందారు.
ఆ ఆవేదనతోనే..
అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకునే ముందు దాదాపు 80 నిమిషాల వీడియోను చిత్రీకరించాడు. 'నేను సంపాదించే డబ్బు నా శత్రువులను మరింత బలోపేతం చేస్తుంది. వారు దాన్ని వాడుకొనే నన్ను నాశనం చేస్తున్నారు. ఇది ఒక విష వలయంలా మారింది. అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నా.' అంటూ అందులో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, భరణం ఇవ్వలేకపోతే చచ్చిపోవచ్చు అని న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుటే భార్య అతడిని అనడం.. న్యాయమూర్తి నవ్వడం సుభాష్‌ను తీవ్రంగా బాధించిందని అతుల్ బంధువులు ఓ వార్త సంస్థకు వెల్లడించారు. తన సోదరునికి న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నట్లు అతుల్ సోదరుడు తెలిపారు.