Bengal Panchayat Elections: 



రాష్ట్రవ్యాప్తంగా అలజడి..


పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఎలక్షన్స్‌ని అధికార తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే 2024 ఎన్నికలకు ఇది లిట్మస్ టెస్ట్ లాంటిది. రాజకీయాలనూ శాసించగలిగే స్థాయి ఈ పంచాయతీ ఎన్నికలకు ఉంది. అయితే...ఇవి ప్రశాంతంగా అయితే సాగడం లేదు. ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అల్లర్లు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ జరిగిన హింసాత్మక ఘటనల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 5గురు తృణమూల్ పార్టీకి చెందిన వాళ్లే. కేంద్ర బలగాలు ఉండి కూడా తమ కార్యకర్తలకు ఎలాంటి రక్షణ కల్పించలేదని మండి పడుతోంది TMC. రెండు పోలింగ్ బూత్‌లలో బ్యాలెట్ బాక్స్‌లను ధ్వంసం చేశారు. ఈ గొడవల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. జూన్ 8న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. ఓ పోలింగ్‌ బూత్‌లోకి బీజేపీ కార్యకర్త ఎంటర్ అవ్వాలని చూడగా అక్కడే ఉన్న TMC కార్యకర్తలు అడ్డుకున్నారు. ఒక్కసారిగా వాగ్వాదానికి దిగారు. పరిస్థితులు అదుపు తప్పి నేరుగా చంపేంత వరకూ వెళ్లాయి. కానీ..టీఎమ్‌సీ మాత్రం ఇవి తప్పుడు ఆరోపణలని కొట్టి పారేస్తోంది. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న వ్యక్తినీ హత్య చేశారు. తృణమూల్ పార్టీ కార్యకర్తల్ని చంపేస్తున్నా..కేంద్ర భద్రతా బలగాలు ఏమీ పట్టించుకోవడం లేదని కొందరు మంత్రులు మండి పడుతున్నారు. 


"ఈ స్థాయిలో రాష్ట్రంలో హింస జరుగుతుంటే కేంద్ర భద్రతా బలగాలు ఎక్కడికి వెళ్లిపోయాయి..? డైరెక్ట్‌గా ఆయుధాలు తీసుకుని పోలింగ్ బూత్‌ల వద్దకు వస్తున్నారు. కావాలనే గొడవ పడి చంపేస్తున్నారు. కేవలం ఓ పార్టీకి కొమ్ము కాయడానికి మాత్రమే కేంద్ర బలగాలున్నాయా..? 


- తృణమూల్ మంత్రి 






అటు బీజేపీ మాత్రం తృణమూల్‌ కారణంగానే రాష్ట్రం ఇలా అయిందని ఆరోపిస్తోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని, TMC కార్యకర్తలు హత్యలు చేస్తున్నారమని మండి పడింది. ఈ ఘటనలపై గవర్నర్ కీలక భేటీ నిర్వహించారు. ప్రత్యేకంగా Peace Home అని తన నివాసంలో ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు.