Bapatla court verdict: బాపట్ల జిల్లా (పూర్వపు గుంటూరు జిల్లా) నిజాంప‌ట్నం మండ‌లం అడ‌వుల‌దీవి కేసులో తెనాలి జిల్లా కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో 13 మందికి జీవిత ఖైదు విధించింది తెనాలి కోర్టు. కేసులో మిగిలిన నలుగురికి కేసు నుంచి రిలీఫ్ చేస్తూ న్యాయ‌మూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. 


అసలేం జరిగిందంటే..
2016లో అడ‌వుల‌దీవిలో రేప‌ల్లెకు చెందిన జాస్మిన్ మృతి చెందింది.  ఆమె మృతికి శ్రీ‌సాయి స‌హా మ‌రో యువ‌కుడు కార‌ణమ‌ని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమకు అనుమానం ఉన్న ఇద్దరు యువకులను చెట్టుకు కట్టేసి చితకబాదారు గ్రామ‌స్తులు. యువకులను తీవ్రంగా కొట్టడంతో శ్రీ‌సాయి అనే యువ‌కుడు మృతి చెందాడు. అప్పట్లో ఈ కేసు సంచ‌ల‌నం రేకెత్తించింది. కాగా, బాధితుల తరఫు వారు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. 21 మందికి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


ఈ కేసు బుధవారం మరోసారి విచారణకు రాగా, పోలీసులు అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించారు. 13 మంది నిందితులకి జీవిత ఖైదు విధిస్తూ 11వ అద‌న‌పు జిల్లా జ‌డ్డి జి మాల‌తి తీర్పు వెలువరించారు. మొత్తం 21 మందిపై కేసు నమోదు కాగా, వీరిలో నలుగురు నిందితులు ఇదివరకే చనిపోయారు. మిగిలిన 17 మందిలో నలుగురికి కేసు నుంచి రిలీఫ్ చేస్తూ న్యాయ‌మూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. మ‌రో 13 మందిని నిందితులుగా తేలుస్తూ తెనాలి జిల్లా కోర్టు యావ‌జ్జీవ శిక్ష విధించింది. ఈ కేసు తీర్పు స్థానికంగా సంచలనంగా మారింది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial