Bank Manager Suicide: బ్యాంకులో తీసుకున్న రుణాలు చెల్లించలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్లు. కానీ ఇక్కడ మాత్రం అప్పులు ఇచ్చిన పాపానికి ఓ మేనేజర్ బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది. అయితే తాను బ్యాంకు ద్వారా ఇచ్చిన రుణాలను ఖాతాదారులు చెల్లించకపోవడంతో అధికారులు ఒత్తిడి చేశారు. దీంతో తానే అప్పులు చేసి మరీ ఖాతాదారుల రుణాలు చెల్లించాడు. అనంతరం మనోవేదన భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటన ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
భార్య ఇంటికొచ్చేసరికే భర్త ఆత్మహత్య..
సాయిరత్న శ్రీకాంత్(33) యానాంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆయన అద్దె ఇంట్లో ఉంటున్నారు. రోజూలాగే మంగళ వారం ఉదయం ఆయన భార్య గాయత్రి పిల్లలిద్దరినీ బడికి తీసుకెళ్లారు. అప్పటి వరకు వారితో హాయిగా గడిపిన శ్రీకాంత్.. భార్య ఇంటికి వచ్చేలోపు ఇంట్లోని ఫ్యానుకు ఉరి వేసుకొని చనిపోయారు. అయితే ఇంటికి వచ్చిన భార్య ఎన్నిసార్లు తలుపు కొట్టినా తెరవకపోవడంతో కిటీకీలోంచి చూసింది. శ్రీకాంత్ ఫ్యానుకు వేళాడుతుండటం చూసి ఒక్కసారిగా షాక్ కు గురైంది. స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
గుండెలవిసేలా రోదిస్తున్న భార్య..
శ్రీకాంత్ యానాంకు రాకముందు మూడేళ్ల పాటు మచిలీపట్నం బ్రాంచిలో మేనేజర్ గా పని చేశారు. ఆ సమయంలో ఉన్నతాధికారులు నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేశారు. తీసుకున్న వారు తిరిగి చెల్లించకపోవడంతో బయట అప్పు చేసి రూ. 60 లక్షల వరకు శ్రీకాంతే చెల్లించాడు. ఆ తర్వాత యానాంకు బదిలీపై వచ్చారు. ఇక్కడ కూడా మరో రూ. 37 లక్షల వరకు అప్పు చేసినట్లు తెలిసిందని పోలీసులు చెబుతున్నారు. విధి నిర్వహణలో సమస్యలతో తన భర్త మానసికంగా తీవ్ర ఒత్తిడితో ఉండేవారని భార్య గాయత్రి పోలీసులకు తెలిపారు. అప్పులు త్వరలో తీరిపోతాయని గత రాత్రే ఎంతో ఆనందంగా చెప్పారని గాయత్రి గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరు అయింది. పై అధికారులు వేధింపులు, ఎవరో తీసుకున్న రుణాల వల్ల తాను, తన పిల్లలు అనాథలం అయ్యామంటూ గుండెలవిసేలా రోదించింది.
అధికారుల వేధింపులు తాళలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య..
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కేసారం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ పొద్దటూరు అశోక్(38) ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అంతకు ముందే కూలి పనికి వెళ్తున్న భార్యను పొలం వద్ద ఆయన దింపి వచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే భార్యకు ఫోన్ చేసి.. నేను ఉరి వేసుకుంటున్న, పిల్లలు జాగ్రత్త అని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. షాక్ అయిన భార్య భర్తకు ఏమైందో తెలియక ఏడుస్తూ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చింది. కానీ అప్పటికే అతడు ఉరి వేసుకొని చనిపోయాడు. ఇంటి తలుపులు తెరిచి చూసే సరికి ఉరికి వేలాడుతూ కనిపించాడు. అప్పటి వరకు బాగానే ఉన్న భర్త సడెన్ గా బలవన్మరణం చేసుకోవడం జీర్ణించుకోలేని ఆ భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. స్థానికుల ద్వారా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయాల గురించి ఆరా తీస్తున్నారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మహత్య చేసుకున్న అశోక్ గత కొంత కాలంగా కార్గో బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇటీవలే ఆయన నడుపుతున్న బస్సుకు డ్యామేజీ అయింది. దీంతో అధికారులు అతడిని డ్రైవర్ పని నుంచి తొలగించి.. డిపో వద్ద పార్కింగ్ పని అప్పగించారు. పగలు విధులు ఇవ్వాలంటే బస్సు డ్యామేజీకి పెనాల్టీ మొత్తం చెల్లించాలంటూ అధికారులు వేధిస్తున్నారంటూ భార్య లావణ్యకు పలుమార్లు చెప్పాడు. ఇదే విషయంపై చాలా రోజులుగా డల్ గా ఉన్నాడని.. మానసికంగా కుంగిపోయిన తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే తన భర్త చావుకు పరోక్షంగా కారణం అయిన అధికారులపై కఠిన తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.