Baby Kidnap: ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో కరీంనగర్ లో చిన్నారి కిడ్నాప్ జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర వయసు ఉన్న పాపను అపహరించారు. పంద్రాగస్టు వేళ జరిగిన ఈ కిడ్పాన్ ఘటన కరీంనగర్ లో కలకలం సృష్టించింది. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి సాంకేతిక సాయంతో ఈ కేసును ఛేదించారు. గంటల వ్యవధిలోనే ఆ చిన్నారిని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. 




కిడ్నాప్ ఎలా జరిగింది?


మహమ్మద్ కుత్బోద్దీన్ మాంసం వ్యాపారం చేస్తూ కరీంనగర్ లోని అశోక్ నగర్ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. ఇతనికి ఒకటిన్నర సంవత్సరాల పాప ఉంది. ఆగస్టు 15వ తేదీ 2022 రోజున సాయంత్రం 7 గంటల సమయంలో మహమ్మద్ కుత్బోద్దీన్ కుమార్తె ఇంటి ముందు ఆడుకుంటుంది. కేరింతలు కొడుతూ బుడి బుడి అడుగులు వేస్తున్న ఆ చిన్నారిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. పాప కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు చుట్టు పక్కల వెతికారు. అయినా వారికి చిన్నారి ఆచూకీ తెలియలేదు. పాప కోసం వెతుకుతున్న క్రమంలో ఓ ఆటో డ్రైవర్ ముందు చిన్నారిని కూర్చొబెట్టుకుని వెళ్తుండగా కనిపించినట్లు స్థానికులు తెలిపారు. ఆ సమాచారంతో పలు చోట్ల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో సుమారు తొమ్మిదిన్నర ప్రాంతంలో పోలీసులను ఆశ్రయించారు. 


కేసును ఇలా ఛేదించారు..!


స్థానికులు చెప్పిన వివరాలను పోలీసులకు వెల్లడించారు. ఎవరో ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, చిన్నారి కిడ్నాప్ పై వెంటనే స్పందించారు. వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ నటేష్ కుమార్, ఎస్సైలు శ్రీనివాస్, రహీంఖాన్ సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. స్థానికులను విచారించారు. తర్వాత ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. కరీంనగర్ సీపీ సత్య నారాయణ ఆదేశాల మేరకు పలు పోలీసుల బృందాలను ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం చిన్నారి కోసం వెతుకులాట ప్రారంభించారు. నాఖా చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా మరియు సుభాష్ నగర్, కరీంనగర్ బస్టాండ్, రాజీవ్ చౌక్ తదితర ప్రాంతాలలో ఆటో అడ్డాలను తనిఖీ చేశారు.


సీసీటీవీ కెమెరాలతో వివరాలు..


కిడ్నాప్ జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అక్కడి నుండి వెళ్లే వివిధ దారుల్లోని కెమెరాలను నిషితంగా చూశారు. అన్ని కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రమంలో వారికి మంచిర్యాల్ చౌరస్తా సమీపంలోని ఒక ఆసుపత్రి వద్ద ఆటో ఆగి, అక్కడి నుండి వెళ్లినట్టుగా గమనించారు. అయితే ఆటో ముందు జాతీయ జెండా ఉండటం, వెనక చెట్టు ఆకారంలో ఉన్న స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు. ఆటో నంబర్ మాత్రం తెలుసుకోలేకపోయారు. నిందితుడు లేత గులాబీ రంగు షర్ట్ ధరించి ఉన్నట్లు పోలీసులు గమనించారు. ఆటో వెనక ఉన్న స్టిక్కర్ చూపించి పలు ఆటో అడ్డాలలో వెతకడం ప్రారంభించారు. ఆటో సుభాష్ నగర్ ప్రాంతం నుండి వచ్చినట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలో గాలిస్తుండగా ఓ ఇంటి ముందు ఆటో కనిపించింది. ఆ ఇంట్లో ఉన్న సంతోష్ అనే వ్యక్తిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయట పడింది. 


చిన్నారిని అపహరించి అమ్మాలని ప్రయత్నం..


ఒంటరిగా ఆడుకుంటున్న చిన్నారిని అపహరించి అమ్మి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. పాపను తన మిత్రుడు ఖాజీపూర్ కు చెందిన కొలమద్ది రాములు అనే అతని ఇంటి వద్ద దాచి ఉంచినట్లు తెలిపాడు. వెంటనే రెండో నిందితుడు రాములును అదుపులోకి తీసుకొని, బాలికను తల్లి ఒడికి చేర్చారు.