Nandyal District Crime News: నంద్యాల జిల్లా డోన్‌ నియోజకర్గంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. పట్టపగలే కొందరు కత్తులు, మారణాయుధాలతో రోడ్లపై తిరుగుతున్నారు. ప్రత్యర్థులను హతమార్చేందుకు బహిరంగంగా రోడ్లపైనే తిరుగుతున్నారు. గత ఫిబ్రవరిలో డోన్ నియోజవర్గంలో పట్టపగలే దారుణ హత్య కలకలం రేపింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దుండగులు మారణాయుధాలతో ఓ వ్యక్తిని హతమార్చారు. ఆ ఘటన మరువముందే అదే నియోజకవర్గంలో మంగళవారం మరో హత్య జరిగింది. 


ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగించే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం కత్తులు, వేట కొడవళ్లు, మారణాయుధాలతో దాడి చేశారు. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని విచక్షణారహితంగా నరికారు. అడ్డుకోబోయిన వారిపై సైతం బెదిరింపులకు దిగడంతో ప్రజలు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. నిమిషాల వ్యవధిలో వ్యక్తిని దారుణంగా నరికి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన డోన్ మండలంలో కలకలం రేపింది.


నంద్యాల జిల్లా డోన్ మండలం చండ్రపల్లి చెందిన సుంకన్న ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. డోన్ ఎద్దుల సంత దగ్గర వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవళ్లు, కత్తులు, మారణాయుధాలతో అతనిపై దాడి చేశారు. చుట్టుపక్కల వారు వారిని అడ్డుకోవాలని యత్నించగా వారిని చంపేస్తామంటూ దుండగులు బెదింపులకు దిగారు. సుంకన్నను అతి దారుణంగా నరికి పారిపోయారు. నిమిషాల వ్యవధిలో జరిగిన ఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా భయాందోళన, షాక్‌కు గురైంది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కొనఊపిరితో ఉన్న సుంకన్నను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  


గత ఫిబ్రవరిలో డోన్ నియోజవర్గంలో దారుణ హత్య జరిగింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దుండగులు మారణాయుధాలతో ఓ వ్యక్తిని హతమార్చారు. మైనింగ్ మాఫియా చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


గత ఏడాది డిసెంబర్‌లో డోన్ పట్టణంలో ఏకంగా మహిళా జడ్జి వెళ్తున్న ఆటోను దుండగులు అడ్డుకుని వీరంగం సృష్టించారు. రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తున్న జడ్జితో దుర్భాషలాడారు. తాను జడ్జిని అని చెప్పినా వినకుండా ఆమెకు రక్షణగా ఉన్న హోంగార్డ్ పై దాడి చేశారు. దీనిపై జడ్జి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక జడ్జికే ఇలాంటి పరిస్థితి తలెత్తితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మందుబాబులు రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో తిరుగుతుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.