Vizag Man Attack : విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో ఓ దళిత యువకుడ్ని చెట్టుకు కొట్టేసి కొట్టిన వ్యవహారం కలకలం రేపుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మందిపై ఓ యువకుడు అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టారన్న ఉద్దేశంతో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. చెట్టుకు కట్టేసి చెప్పుతో కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ అంశంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా స్పందించారు. అణగారిన వర్గాల నుంచి రావడమే తప్పన్నట్లుగా జగన్ సర్కారు వ్యవహరిస్తోందని సదరు ట్వీట్‌లో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు దళిత యువకుడిని చెట్టుకు కట్టేసి కొడుతున్న వీడియోను కూడా చంద్రబాబు తన ట్వీట్‌కు జత చేశారు. తన గ్రామంలో అభివృద్ధి జరగని వైనాన్ని ఆ దళిత యువకుడు ప్రశ్నించాడని, అదే తప్పన్నట్లుగా అతడిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ జమానాలో ప్రశ్నించడమే తప్పన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అణగారిన వర్గాల హక్కులను హరించడమే వైసీపీ సర్కారు పద్ధతిగా మారిందని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ శ్రేణుల చేతుల్లో దాడికి గురైన బాధితుడికి, అతడి కుటుంబానికి న్యాయం జరిగే దాకా టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు. నిందితులపై చర్యలు తీసుకునే దాకా తాము పోరాటం చేస్తామని కూడా ఆయన ప్రకటించారు.
పలువురు టీడీపీ నేతలతో పాటు నెటిజన్లు కూడా ఓ దళితుడ్ని అలా కొడుతూంటే.. పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.