New Labour Law in India 2022: కొత్త కార్మిక చట్టాలను 2022, జులై 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని కేంద్రం ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఒకప్పుడు గుంపగుత్తగా, వేర్వేరుగా ఉన్న చట్టాలను మోదీ ప్రభుత్వం ఒక్క చోటకు చేర్చింది. మొత్తం సంస్కరించి నాలుగు కొత్త కార్మిక చట్టాలను రూపొందించింది. ఉద్యోగుల వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్, పని గంటలు, సెలవుల విధానాల్లో మార్పులు తీసుకొచ్చింది. అటు కంపెనీలు, ఇటు ఉద్యోగుల మధ్య సమతూకం ఉండేలా నిబంధనలు తీసుకొస్తున్నట్టు తెలిసింది. ఇంతకీ ఏమేం మారుతున్నాయంటే?
* ప్రధాని నరేంద్రమోదీ ఈ కొత్త చట్టాలను సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జులై 1 నుంచి అమలు చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి ఆమోదం తెలిపాయి. కొన్ని రాష్ట్రాలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
* సరికొత్త చట్టాల్లో వేతనాలు, సామాజిక భద్రత, వ్యాపార-వాణిజ్య సంబంధాలు, ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులపై మార్పులు ఉన్నాయి.
* కొత్త చట్టాల్లో పని గంటలపై సుదీర్ఘంగా వివరించారు. గరిష్ఠ పరిమితిని రోజుకు 12 గంటలకు పెంచారు. దీంతో వారానికి నాలుగు రోజుల పని, మూడు రోజుల వీకాఫ్‌కు మార్గం సుగమం కానుంది. ప్రస్తుతం ఉద్యోగులు రోజుకు 8-9 గంటల పాటు పనిచేస్తున్నారు. నాలుగు రోజుల పని కావాలంటే పని గంటలు పెరుగుతాయి. 12 గంటలు చేయాల్సి వస్తుంది. ఇక మూడు నెలలకు 50 గంటల ఓటీని 150కి పెంచబోతున్నారు.
* చేతికొచ్చే వేతనం, పీఎఫ్ కంట్రిబ్యూషన్‌లో మార్పు ఉండబోతోంది. మొత్తం జీతంలో మూల వేతనం (Basic Pay) 50 శాతం ఉండేలా చూస్తున్నారు. దీంతో చాలామంది సాలరీ స్ట్రక్చర్ మారబోతోంది. మూల వేతనం పెరగడం, పీఎఫ్, గ్రాట్యుటీకి ఎక్కువ డబ్బు కోత విధిస్తారు కాబట్టి చేతికందే వేతనం తగ్గుతుంది! దీనివల్ల ఉద్యోగికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అధికంగా ఉంటాయి. ఆఖర్లో చేతికందే మొత్తం పెరుగుతుంది.
* ప్రస్తుతం వేతనంతో కూడిన సెలవులు రాష్ట్రాల్లో అయితే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం, కేంద్ర స్థాయిలో ఫ్యాక్టరీల చట్టాన్ని అనుసరించి ఉంటున్నాయి. వీటికి ఏకరూపత తీసుకురానున్నారు. ఇక నుంచి రెండింటి సమన్వయంతో 'వర్కర్' అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇవ్వబోతున్నారు. కనీస వేతనం రూ.18,000గా ఉండనుంది.
* వార్షిక సెలవుల్లోనూ మార్పులు వస్తున్నాయి. ప్రస్తుతం 240 రోజులు పనిచేస్తే 12 సాధారణ సెలవులు ఇస్తున్నారు. ఈ పరిమితి ఇప్పుడు 180 రోజులకు తగ్గించారు. అంటే ప్రతి 20 రోజుల పనికి ఒక సాధారణ సెలవు రానుంది.
* క్యారీ ఫార్వర్డ్ సెలవుల పరిమితిని 30గానే ఉంచారు. ఉదాహరణకు ఉద్యోగికి ఏడాది ముగింపునకు 45 రోజుల సెలవులు ఉన్నాయనుకుందాం! అలాంటప్పుడు కంపెనీ ఉద్యోగికి 15 రోజులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఇవ్వాలి.