Encounter with security personnel Kanker district in Chhattisgarh - రాయ్‌పూర్: ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో కనీసం 18 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ సిబ్బంది తెలిపారు. నెలరోజుల వ్యవధిలో జరిగిన ఇది ఐదవ ఎన్ కౌంటర్ కాగా, దాదాపు 10 రోజుల కిందట జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మృతిచెందారు.






కాల్పులతో దద్దరిల్లుతోన్న ఛత్తీస్ గఢ్.. 
ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతం గత నెలరోజులుగా కాల్పులతో దద్దరిల్లుతోంది. లోక్‌సభ ఎన్నికలు కావడంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులో, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోనూ ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 16న ఛత్తీస్ గఢ్ రాష్ట్రం కాంఖేర్ జిల్లాలోని బినగుండ అటవీప్రాంతంలో కాల్పుల మోత మోగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో కనీసం 18 మంది మావోయిస్టులు మృతిచెందగా.. పలువురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఎన్ కౌంటర్ జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.


డిస్ట్రిక్ రిజర్వ్ బలగాలు ఛోటెబేటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినగుండ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలను చూసిన మావోయిస్టులు వారిపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. అలర్ట్ అయిన పోలీస్ ఫోర్స్ ఎదురుకాల్పులు జరిపింది. అనంతరం 18 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఏడు ఏకే సిరీస్ రైఫిల్స్, మూడు లైట్ మేషిన్ గన్స్ ను మావోయిస్టుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.  


ఛత్తీస్ గఢ్‌లో వరుస ఎన్ కౌంటర్లు.. 
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. గంగలూరు పోలీస్‌ స్టేషన్ పరిధిలో కొర్చోలి, లేండ్ర అడవుల్లో మావోయిస్టులు కాల్పులు జరపగా.. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు హతమయ్యారు. మరో ఎన్ కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. వారి వద్ద నుంచి ఏకే-47, ఎల్ఎంజీ ఇతరత్రా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.