Aswaraopeta SI Suicide Attempt: అశ్వారావుపేట (Aswaraopeta) ఎస్ఐ శ్రీరాముల శ్రీను (34) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను ఆదివారం అదృశ్యమయ్యారు. ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన.. సిబ్బందికి కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత ఒక్కరే కారు డ్రైవింగ్ చేసుకుంటూ బయటకు వెళ్లిపోయారు. మధ్యాహ్నమైనా ఠాణాకు తిరిగి రాలేదు. దీంతో సిబ్బంది కాల్ చేసినా ఆయన రెండు ఫోన్లు స్విచ్చాఫ్ వచ్చాయి. దీంతో వారు విషయాన్ని సీఐ జితేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఎస్పీకి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు గాలింపు చేపట్టగా.. రాత్రి 11:30 గంటలకు ఆయన ఆచూకీ లభ్యమైంది.


పురుగుల మందు తాగి..


మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న ఎస్సై శ్రీను.. స్వయంగా 108కు ఫోన్ చేశాడు. దీంతో వైద్య సిబ్బంది మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన శ్రీను అశ్వారావుపేటలో 5 నెలలుగా ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. గత కొద్ది రోజులుగా స్టేషన్‌లో ఎస్సై, సిబ్బంది మధ్య సఖ్యత లేదని తెలుస్తోంది. ఆయనపై వచ్చిన ఆరోపణలు, ఉన్నతాధికారులకు ఫిర్యాదులతోనే ఆవేదన చెందినట్లు ప్రచారం జరుగుతోంది.


అటు, తమ కుటుంబంలో ఎలాంటి వివాదాలు లేవని ఎస్సై తల్లి తెలిపారు. తమ కుమారుడు ఎందుకు ఆత్మహత్యకు యత్నించాడో తెలియదని చెప్పారు. ఆ స్టేషన్‌కు వెళ్లిన నాటి నుంచే ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. స్టేషన్‌లో ఏం జరిగిందో తమకు తెలియదని.. పోలీసులు ఏ విషయాలు చెప్పడం లేదని వాపోయారు.


Also Read: Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం