AR Constable Suicide: కష్టపడి చదివాడు. కన్నవాళ్ల ఆశలకు తగ్గట్లుగా ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. 30 ఏళ్ల వయసు కూడా వచ్చే సరికి కుమారుడికి పెళ్లి చేయాలనుకున్నారు. అతడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశారు. నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఇంతలోపే అమ్మాయి వాళ్లకు ఇతగాడి ప్రేమ వ్యవహారం గురించి తెలిసింది. దీంతో మోసపోయినట్లు భావించిన వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది తెలుసుకొని తనకు, తన మేన మరదలుకు ఎలాంటి రిలేషన్ షిప్ లేదని రుజువు చేశాడు. అందరి ముందే బాండ్ పేపర్ కూడా రాయించాడు. కానీ ఆ మరుసటి రోజే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 


అసలేం జరిగిందంటే?


వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ ఖాన్ పేట గ్రామానికి చెందిన 30 ఏళ్ల వెంకటేశ్ అనే యువకుడు కానిస్టేబుల్ ఉద్యోగం సంపాధించాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఎంసీ సెక్షన్లో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే కుమారుడికి పెళ్లి వయసు రావడం, బాగా సెటిలవడంతో తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే అతడికి నచ్చిన షాద్ నగర్ కు చెందిన ఓ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది. మూడ్రోజుల క్రితమే అతడు గచ్చిబౌలి నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఈక్రమంలోనే అమ్మాయి కుటుంబ సభ్యులకు అతడి ప్రేమ వ్యవహారం గురించి తెలిసింది. ప్రజలను కాపాడి, అందరికీ బుద్ధులు చెప్పాల్సిన పదవిలో ఉన్న అతడే తమను మోసం చేశాడని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. 


తమ మధ్య ఎలాంటి బంధం లేదని బాండ్ పేపర్లు రాయించిన వెంకటేష్


విషయం తెలుసుకున్న వెంకటేష్ అవన్నీ పుకార్లని చెప్పాడు. వెంటనే పెద్దలను పిలిపించి మేనత్తను, ఆమె కూతురిని కూడా తీసుకొచ్చి తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెప్పించాడు. నోటరీ పేపర్లపై కూడా తమ మధ్య ఎలాంటి బంధం లేదని రాయించి ఇచ్చాడు. సమస్యంతా తీరిపోయిందనుకొని అంతా ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు. ఏమైందో తెలియదు కానీ వెంకటేష్ పొలంలోని ఓ చెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు. దారిన వెళ్లే వారు విషయం గుర్తించి అతడిని కిందకు దించారు. కానీ అప్పటికీ ఆయన మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకొని హాయిగా గడపాల్సిన కుమారుడు అచేతనంగా పడి ఉండడం చూసి ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడిపై అమ్మాయి తరపు వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్లే పరువు పోయిందని భావించి తమ కుమారుడు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అంటున్నారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంకటేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి తరఫు వాళ్లు మళ్లీ ఏమైనా అన్నారా, లేక ఈయన పరువు పోయిందని భావించి ఆత్మహత్య చేసుకున్నాడా అని తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.