Ys Jagan Tweet On Vinukonda Murder: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని.. లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) మండిపడ్డారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైసీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. వినుకొండ (Vinukonda) హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టి సారించాలి. వైసీపీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దు. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.' అని ట్వీట్ చేశారు.






అందరూ చూస్తుండగానే..


నడిరోడ్డుపై వైసీపీ కార్యకర్త దారుణ హత్యతో పల్నాడు జిల్లా మరోసారి ఉలిక్కిపడింది. వినుకొండలో వైసీపీ యువజన విభాగ నేత రషీద్‌పై బుధవారం రాత్రి అతని ప్రత్యర్థి జిలానీ కత్తితో దాడి చేశాడు. అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా నరికాడు. ఈ దాడిలో రషీద్ చేతులు తెగిపోయి ఆర్తనాదాలు చేస్తూ వదిలేయమని ప్రాథేయపడ్డా.. నిందితుడు పట్టించుకోకుండా హతమార్చాడు. ఈ హత్యతో స్థానికంగా ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పాత కక్షలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే పట్టణంలో 144 సెక్షన్ విధించారు.


మరోవైపు, ఈ హత్య కేసు రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ, వైసీపీ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. నిందితుడు జిలానీ టీడీపీ సానుభూతిపరుడిగా పేర్కొంటూ వైసీపీ విమర్శల దాడికి దిగగా.. టీడీపీ ఈ విమర్శలను తిప్పికొట్టింది. వ్యక్తిగత హత్యలతో జరిగిన హత్యలకు రాజకీయ రంగు పులుమవద్దని హితవు పలికింది. గతంలో జిలానీపై రషీద్ దాడి చేశాడని.. ఆ కక్షతోనే ఈ హత్య జరిగిందని దీనికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు.


Also Read: Andhra Pradesh: ఒక కాకిని కట్టేస్తే వందల కాకుల ధర్నా- నడిరోడ్డుపై వ్యక్తిని నరుకుతుంటే వీడియో తీసిన జనం- ఎవరి నుంచి ఏం నేర్చుకోవాలి?