Gun Fire in Annamayya District | రాయచోటి: తెలుగు రాష్ట్రాల్లోనూ గన్ కల్చర్ పెరిగిపోతోంది. గత కొన్నేళ్లుగా గమనిస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నిత్యం ఏదో చోట తుపాకీతో బెదిరింపులనో, గన్‌తో కాల్పులు జరిపి నిందితులు పరారీ అనే విషయాలు వింటూనే ఉన్నాం. తాజాగా ఏపీలోని అన్నమయ్య జిల్లాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తి ప్రాణాలతో పోరాడుతున్నారు.
రాయచోటి మండలం మాధవరంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వ్యాపారులపై కాల్పులు జరిపారు. స్క్రాప్ వ్యాపారం చేసే ఇద్దరిపై నిందితులు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. నిందితుల కాల్పుల్లో పాత సామాన్లు కొనే వ్యాపారులు హనుమంతు(50)తో పాటు రమణ(30) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వ్యాపారులను చికిత్స అందించేందుకు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం హనుమంతును కడప రిమ్స్‌కు తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ హనుమంతు మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డబ్బుల కోసం నిందితులు కాల్పులు జరిపారా, లేక వీరి మధ్య పాత కక్షలు, ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు.
రెండు ప్రమాదాలలో పది మంది మృతి
కర్ణాటకలో అదుపుతప్పి కారుపై కంటెయినర్ పడటంతో ఐటీ కంపెనీ యజమాని సహా ఆరుగురు మృతిచెందారు. ఏపీలోని మడకశిర మండలంలో ఆగి ఉన్న లారీని టెంపో ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందగా, 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు ప్రమాదాలలో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదాలకు ముఖ్యమైన కారణాలలో అతివేగం ఒకటి కాగా, నిర్లక్ష్యం మరో సమస్య అని పోలీసులు చెబుతున్నారు. నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కొందరు, సెల్ ఫోన్లో మాట్లాడుతూ, మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ తమ ప్రాణాలను రిస్కులో పెట్టడంతో పాటు ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.