బల్లికురవ: బాపట్ల జిల్లాలో గ్రానైట్‌ క్వారీలో బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు మృతి చెందడంతో విషాదం నెలకొంది. ఆదివారం ఉదయం బల్లికురవ సమీపంలో సత్యక్రిష్ణ గ్రానైట్‌ క్వారీలో బండరాళ్లు పడి కార్మికులు మృతి చెందారు. సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు నాలుగు మృత దేహాలను వెలికితీయగా, మరో ఇద్దరి మృత దేహాలను బయటకు తీసేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో గ్రానైట్‌ క్వారీలో 16 మంది కార్మికుల వరకు పనిచేస్తున్నారు. గాయపడిన మరో 10 మంది కార్మికులను నరసరావుపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. 

బల్లికురవ క్వారీ ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

బాపట్ల జిల్లా బల్లికురవ క్వారీలో జరిగిన ప్రమాదంలో కార్మికులు మృతి చెందడంపై  ఏపీ సిఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్వారీలో పనులు చేస్తున్న కార్మికులపై రాళ్లు పడడంతో నలుగురు మృతి చెందారు. ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై సిఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంపై బాపట్ల జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, స్థానిక అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు... గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై విచారణకు ఆదేశించారు.

బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో బండరాళ్లు పడి పలువురు కార్మికులు దుర్మరణం పాలవడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.  ప్రమాదంలో రోజువారీ కూలీలు మృతిచెందడం బాధాకరం అన్నారు. గాయపడిన వారికి అవసరమైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.