A.P.Skill Development Corporation Scam: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో సీఐడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. కేసు విచారణలో భాగంగా సీమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌ డైరెక్టర్ జీవీఎస్ భాస్కర్ ను ఏపీ సీఐడీ పోలీసులు యూపీలోని నోయిడాలో అరెస్ట్ చేశారు. బుధవారం ఏపీ సీఐడీ నోయిడాలోని ఆయన నివాసానికి వెళ్లి భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా.. విజయవాడలోని కోర్టులో హాజరు పరిచేందుకుగానూ 36 గంటల సమయం ట్రాన్సిట్ రిమాండ్ విధించారు.


ప్రాజెక్ట్ అంచనాలు తారుమారు చేశారని ఆరోపణలు
ఇతర నిందితులతో కలిసి సిమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం విలువను కృత్రిమంగా రూ. 3300 కోట్లకు పెంచి, ప్రాజెక్ట్ రిపోర్టును తయారు చేశారని భాస్కర్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టు వ్యవయంలో 10 శాతం చెల్లింపులలో భాగంగా అదనంగా రూ. 371 కోట్ల భారం ఏర్పడింది. కానీ సిమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన సాఫ్ట్‌వేర్ ధర కేవలం రూ. 58 కోట్లు అని బిల్లులు చేసి ఉంది. జి.వి.ఎస్.భాస్కర్ ప్రాజెక్ట్ అంచనాలను తారుమారు చేసి రూ. 3300 కోట్లకు చేర్చాడని ఏపీ సీఐడీ అభియోగాలు నమోదు చేసింది.


అవగాహన ఒప్పందం ప్రకారం తారుమారు:
సీమెన్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టెక్నాలజీ అందిస్తున్న పార్ట్ నర్ ఈ ప్రాజెక్ట్ ఖర్చులో 90 శాతం వాటాను అందించాలని భావించారు. కానీ భాస్కర్, మరికొందరు నిందితులు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో కలిసి, అవగాహన ఒప్పందాన్ని తారుమారు చేయడానికి కుట్ర చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు ఎలాంటి సాఫ్ట్ వేర్ ఇవ్వకున్నా, ఇచ్చినట్టుగా రికార్డులు సృష్టించారని సీఐడీ అధికారులు తేల్చారు. సిమెన్స్ + డిజైన్‌టెక్‌ షెల్ కంపెనీలకు రూ.371 కోట్ల పనులు అప్పగించినట్లు ఒప్పందం జరిగింది. అయితే టెక్ సపోర్ట్ అందించే కంపెనీలు ప్రాజెక్టులో 90 శాతం మేర వాటాను భరించాలని సైతం నిర్ణయించారు. అనంతరం ఈ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. 


APSSDCలో డిప్యూటీ సీఈవోగా భాస్కర్ భార్య అపర్ణను పరిచయం చేశారు. ఆమె 2001 ఐఏఎస్ ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందినవారు. స్కిల్ డెవలప్ మెంట్ పనులు మొదలైన వెంటనే  APSSDC MD & CEO అయిన G.సుబ్బా రావు (A-1)తో వీళ్లు కుమ్మక్కయ్యారని ఏపీ సీఐడీ దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. అపర్ణను ఆంధ్రప్రదేశ్‌కి ఇంటర్‌ కేడర్‌ డిప్యూటేషన్‌పై తీసుకువచ్చారు. అయితే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ సీఈఓగా బాధ్యతలు ఇవ్వడం లాంటి విషయంపై ప్రభుత్వానికి ఆమె వెల్లడించకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.


అసలేం జరిగింది? 
ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో సీఐడీ కీలక విషయాలు నమోదు చేసింది.  2015 జూన్‌లో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో ఆర్థికలావాదేవీల్లో అవకతవకలు జరిగాయని గుర్తించింది. జీవో నెంబర్ 4 ప్రకారం సీమెన్స్‌ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్, డిజైన్‌ టెక్‌ ఎండీ వికాస్‌ కన్విల్కర్‌కు గత ప్రభుత్వం రూ.241 కోట్లు కేటాయించిందని తెలిపింది. ఉద్దేశపూర్వకంగా ఈ సొమ్ము అప్పగించిందని వెల్లడించింది. ఈ సొమ్మును 7 షెల్‌ కంపెనీలకు తప్పుడు ఇన్‌వాయిస్‌లు సృష్టించినట్టు తరలించారని తెలిపింది. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని టెక్నాలజీ కంపెనీలు, ప్రభుత్వానికి  విభజించడంలో అవకతవకలు జరిగాయని సీఐడీ పేర్కొంది. 2017-18లో రూ.371 కోట్లలలో.. రూ.241 కోట్లు గోల్‌మాల్‌ జరిగాయని సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో వెల్లడించింది.