Annamayya Crime News : ఆరోగ్యం కోసం తాయత్తు కట్టించుకొని ఆరోగ్యం కుదుట పడలేదని కక్ష పెంచుకుని హత్యాయత్నానికి పాల్పడీ కటకటాల పాలయ్యాడో వ్యక్తి. అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి దర్గా వద్ద బాబా చేత తాయత్తు కట్టించుకుంటే దాని మహిమతో ఆరోగ్యం కుదుటపడుతుందని ఆశపడ్డాడు. తన ఆరోగ్యం కాస్త కుదుట పడకపోవడంతో తాయత్తు కట్టిన బాబాపై పెట్టుకున్నా నమ్మకం కాస్త వికటించి తాయత్తు కట్టిన బాబానే తనకు ఏదో చేశాడని అపనమ్మకంలో బాబాను హతమార్చే కుట్రలో కటకటాల పాలైన సంఘటన అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో చోటుచేసుకుంది. 



దర్గా బాబాపై హత్యాయత్నం 


అన్నమయ్య జిల్లా రాయచోటి డివిజన్ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి పట్టణానికి చెందిన సయ్యద్ నౌషాద్(57) గత 20 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గుర్రంకొండ మండలం బాబా బుడెన్ కొండ(కుక్క రాజు గుట్ట) వద్ద ఉన్న మస్తాన్ వల్లీ దర్గాలో బాబా మదార్ ఖాన్ వద్ద తన ఆరోగ్యం కోసం సయ్యద్ నౌషాద్ తాయత్తు వేయించుకున్నాడు. అయితే సయ్యద్ నౌషాద్ ఆరోగ్యం కుదుటపడకపోగా మరింతగా క్షీణించింది. దీంతో బాబా మదార్ ఖాన్ పై అనుమానం పెంచుకొని అతన్ని హత మార్చేందుకు కుట్ర పన్నాడు సయ్యద్ నౌషాద్. జనవరి 6న సయ్యద్ నౌషాద్ తో పాటు చిత్తూరుకు చెందిన అంబికా పతి ఆనంద్, అబ్దుల్, వర్ధన్ మురుగన్, పూర్ణచంద్ర, అన్నమయ్య జిల్లా గుర్రంకొండకు చెందిన తాహిర్ లతో కలసి బాబా మదర్ ఖాన్ ను హతమార్చేందుకు వెళ్లారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ఓ పల్లె సమీపంలో మదర్ ఖాన్ ను కొడవళ్లతో హతమార్చేందుకు వెంటపడ్డారు. ప్రాణభయంతో అరుస్తూ పరుగులు తీశాడు బాబా మదార్ ఖాన్. అయితే‌ అదే సమయంలో సమీపంలో పొలాల్లో పని చేస్తున్న రైతులను చూసి హంతకులు అక్కడ నుంచి పారిపోయారు. మదర్ ఖాన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన గుర్రంకొండ ఎస్సై దిలీప్ విచారణలో భాగంగా ఇవాళ తంబళ్లపల్లె మండలం యడంవారిపల్లె నుంచి కోటకొండకు వెళ్లే దారిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారిని విచారించగా అసలు విషయం తెలిసిందని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి వాల్మీకిపురం కోర్టుకు తరలించినట్లు రాయచోటి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. 


ముగ్గురిపై హత్యాచారం..




యూపీలోని బరబంకి ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. మహిళలనే టార్గెట్ చేస్తూ హత్య చేస్తున్న సీరియల్ కిల్లర్ అక్కడే తిరుగుతున్నాడని తెలిసి భయపడిపోతున్నారు. ప్రస్తుతానికి ఆరు పోలీస్ బృందాలు కిల్లర్ కోసం గాలిస్తున్నాయి. సోషల్ మీడియాలో నిందితుడి ఫోటో షేర్ చేశారు. గుర్తించిన వారెవరైనా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు చెప్పారు. ఇప్పటికే ముగ్గురు మహిళలను దారుణంగా చంపేశాడు నిందితుడు. గతేడాది డిసెంబర్ 5న అయోధ్య జిల్లాలో ఖుషేటి గ్రామానికి చెందిన 60 ఏళ్ల మహిళ ఏదో పని మీద బయటకు వచ్చింది. సాయంత్రం మళ్లీ తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు పెట్టారు. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులకు...డిసెంబర్ 6న ఓ చోట ఆమె మృతదేహం కనిపించింది. శరీరంపై బట్టలు లేవని, ముఖంపై తీవ్రంగా గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. అయితే...ఆ మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌లో తేలింది. ఆ తరవాత కొద్ది రోజులకే...బరబంకిలో మరో మహిళ మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ఈమెను కూడా అత్యాచారం చేసిన చంపినట్టు పోస్ట్‌ మార్టం రిపోర్ట్ వెల్లడించింది. డిసెంబర్ 30న తతర్హా గ్రామంలో 55 ఏళ్ల మహిళనూ ఇదే విధంగా హత్య చేశాడు సీరియల్ కిల్లర్. ఈ కేసుని విచారిస్తున్న పోలీస్ ఆఫీసర్‌ను తొలగించి...మరో అధికారిని నియమించారు. బరబంకి ఏరియాలో హై అలర్ట్ ప్రకటించారు.