Annamayya District Crime News: తల్లిలేని ఆ పిల్లల వద్దకు వెళ్లిన తండ్రి ప్రేమగా వారిని పలకరించాడు. నలుగురు పిల్లలను తనివితీరా చూసుకొని ముద్దుల వర్షం కురిపించాడు. కంటతడి పెట్టాడు. వారితో చాలా సేపు గడిపాకా.. "కన్నా.. ఇక నేను ఇక్కడికి రాలేను. మేడమ్ వాళ్లు చెప్పినట్లు బాగా చదువుకోండి" అని పిల్లలకు చెప్పాడు. అనంతరం బయటకు వచ్చిన అతను ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కింద పడి మృతి చెందాడు. ఆ నలుగురు పిల్లలకు అండగా ఉండాల్సిన అతడు.. వారిని అనాథలను చేసి అనంత వాయువుల్లో కలిసి పోయాడు.
అసలేం జరిగిందంటే..?
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన 35 ఏళ్ల కలమడి ప్రసాద్ బాబు, 28 ఏళ్ల సుకన్య దంపతులు. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా నలుగురు పిల్లలు కూడా పుట్టారు. వారే ఐశ్వర్య, అక్షిత, అరవింద్, అవినాష్. బేల్దారి పనులు చేసుకుంటూ ప్రసాద్ బాబు కుటుంబాన్ని పోషించుకునేవాడు. గత కొంత కాలంగా దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు వారాల కిందట భార్య క్షణికావేశంతో ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది. నలుగురు చిన్న పిల్లలకు తల్లి తోడని విషయం మరిచి వారికి దూరం అయింది. అప్పటి నుంచి ప్రసాద్ బాబు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఓ వైపు భార్య లేదని బాధ, మరోవైపు తనది తప్పేమోనన్న ఆత్మన్యూనత, ఇంకోవైపు నలుగురు చిన్నారు. ఇవన్నీ చూసిన అతను ఓ నిర్ణయానికి వచ్చాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్నాడు.
అందుకోసం ముందుగా పిల్లలను ఎవరికైనా అప్పగించాలనుకున్నాడు. స్థానిక అంగన్ వాడీ సిబ్బంది ద్వారా పిల్లలను గత నెల 29వ తేదీన ఐసీడీఎస్ అధికారులకు అప్పగించాడు. తల్లి లేకపోవడం వల్ల వారిని తాను పోషించలేనని, మీరు చూసుకోవాలంటూ లేఖ కూడా రాసిచ్చాడు. వారు పోలీసుల సమక్షంలో బాలలను సంరక్షణలోకి తీసుకొని రాజంపేట బాల సదన్ లో చేర్చారు. ఆదివారం కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రసాద్ బాబు పిల్లల వద్దకు వెళ్లాడు. కాసేపు వారితో హాయిగా గడిపాడు. సోమవారం ఉదయం రైల్వే కోడూరులోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలను అప్పగించే ముందు రోజు నుంచే తాను చనిపోతానని.. పిల్లలను బాగా చూసుకోవాలని తమను కోరినట్లు సీడీపీఓ రాజేశ్వరి తెలిపారు. చనిపోతే పిల్లలకు ఎవరూ లేకుండా పోతారని ఎంతగా చెప్పినా, కౌన్సిలింగ్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య..
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన వేదశ్రీ (23)కు, ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ప్రశాంత్ తో 2015లో వివాహమైంది. ప్రశాంత్ ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ప్రజ్ఞ(5), వెన్నెల (3). ఇచ్చోడలో అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు. భర్త యథావిధిగా ఉద్యోగానికి వెళ్లగా, ఇంట్లోనే ఉన్న వేదశ్రీ గురువారం సాయంత్రం కుమార్తెలను వెంటబెట్టుకుని వంట గదిలోకి వెళ్లింది. పిల్లలతోపాటు తనపైనా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇంటి లోపలి నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు హుటాహుటిన వచ్చి తలుపులు పగలగొట్టారు. తల్లీబిడ్డలు మంటల్లో కాలిపోతున్నట్టు గుర్తించి మంటలు ఆర్పారు. అప్పటికే వేదశ్రీ మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న చిన్నారులను అంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తొలుత ప్రజ్ఞ, రెండు గంటల తర్వాత వెన్నెల మరణించారు. వేదశ్రీకి, అత్తింటి వారికి మధ్య మనస్పర్దలున్నట్టు, ఈ క్రమంలోనే వేరుకాపురం పెట్టినట్టు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.