Road Accident in Annamayya District: అతివేగంగా వాహనాలు నడిపినా, నిర్లక్ష్యంగా ఉన్నా రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉంటాయి. తాజాగా ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో శనివారం చోటుచేసుకుంది. గాయపడిన వారిని రాజంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స అందించేందుకు తరలించినట్లు సమాచారం.


అసలేం జరిగిందంటే..
ఆర్టీసీ బస్సు కడప నుంచి తిరుపతికి వెళ్తోంది. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పుల్లంపేట సమీపంలో జాతీయ రహదారిపై సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ, ఆర్టీసీ బస్సును ఎదరుగా వచ్చి ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 10 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరీశీలించారు. డెడ్ బాడీలతో పాటు గాయపడిన వారిని చికిత్స అందించేందుకు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ అతివేగంతో వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంతో రాజంపేట-తిరుపతి జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది.