వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. రెండేళ్ల క్రితం పెళ్లిచేసుకున్నారు....కొంతకాలం సంతోషంగానే ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. మాటా మాటా పెరిగి ఏకంగా విడివిడిగా ఉండేవరకూ వెళ్లింది పరిస్థితి. అక్కడి నుంచి ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వరకూ వచ్చింది. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం మునిపల్లెలో జరిగింది.


మునిపల్లి గ్రామానికి చెందిన హరిప్రసాద్ రెడ్డి... పుదుచ్చేరి రెడ్డి వారిపాళ్యంకు చెందిన సత్యవాణిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరిద్దరూ ఉద్యోగ రీత్య బెంగుళూరులో కాపురం ఉండేవారు. కొంతకాలం సంతోషంగా సాగిన కాపురం... ఆతర్వాత కలహాల కాపురంగా మారింది. ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా గొడవలు పెరిగాయి. నిత్యం గొడవలు పెట్టుకునే కన్నా విడివిడిగా ఉండడం మంచిదనే ఆలోచనకు వచ్చారు. ఇద్దరు కలసి నిర్ణయించుకున్నాకే వేర్వేరు ఇళ్లు అద్దెకు తీసుకుని నివాసం ఉండేవారు. ఈ క్రమంలో  హరిప్రసాద్ రెడ్డి కొన్నిరోజులు పుట్టింటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న సత్యవాణి...నిన్న అర్థరాత్రి స్కూటీలో మునిపల్లె గ్రామానికి చేరుకుంది. సత్యవాణి వెళ్లే సమయానికి ఇంట్లో హరిప్రసాద్ లేకపోవడంతో...తన భర్తను ఎలాగైనా తనతో పంపాలని అత్తమామలను వేడుకుంది. తమ ఇంటికి ఎందుకొచ్చావని హరిప్రసాద్ తల్లిదండ్రులు ప్రశ్నించడంతో... ఈ ఇంటి కోడలినైన తనకి ఈ ఇంటికి వచ్చే హక్కుందని సమాధానం చెప్పింది.


Also Read: https://telugu.abplive.com/news/uttarakhand-woman-seeks-bail-of-rapist-husband-to-conceive-high-court-seeks-opinion-1636/amp




తెల్లవారు జామున భర్త ఇంటికి వచ్చే వరకూ వేచి చూసింది. అప్పుడు కూడా ఇద్దరూ తీవ్రస్థాయిలో గొడవ పడ్డారు. క్షణికావేశంలో ఇంటి బయటకు వెళ్లిన సత్యవాణి అప్పటికే తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ క్యాన్  ఓపెన్ చేసి ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. అయితే తనను బెదిరించేందుకే ఇలా చేస్తోందని భావించిన హరిప్రసాద్ పట్టించుకోలేదు. తల్లిదండ్రులను తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోయాడు. మరింత ఆగ్రహంతో ఊగిపోయిన సత్యవాణి ఒక్కసారిగా నిప్పుపెట్టుకుంది. భార్య కేకలు వేయడంతో వెనక్కు తిరిగి చూసిన హరిప్రసాద్... ఆమెను కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో హరిప్రసాద్ కూడా తీవ్ర గాయాల పాలయ్యాడు.  108 సాయంతో ఇద్దర్నీ పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


పరిష్కారం లేని సమస్యలుండవు...కూర్చుని మాట్లాడుకునేందుకు సమయం కేటాయించుకోవాలి...ఇద్దరి మధ్యా అంత సహనం లేదనుకున్నప్పుడు పెద్దలైనా స్పందించి ఇద్దరి మధ్యా సయోధ్య కుదిరేలా చూడాలి. సర్ది చెప్పాలి.  కానీ చాలా జంటల విషయంలో ఈ రెండూ జరగడం లేదు. అందుకే సమస్య నుంచి బయటపడే మార్గం ఉండదేమో అనే భయంతో క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవాలి అనే ఆలోచనకు వచ్చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Also Read: టమోటా ట్రేల మధ్య ఎర్రబంగారం.. మరో కిలోమీటరు దాటితే సేప్ అనుకున్నారు.. కానీ ఇంతలోనే కథ అడ్డం తిరిగింది