Anantapuram Crime News: అనంతపురంలో విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాల కరస్పాండెంట్ పెట్టిన చిత్ర హింసలు భరించలేకే తమ కుమారుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడి చావుకు కారణం అయిన కరస్పాండెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


అసలేం జరిగిందంటే..?


అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని ముద్దలాపురం గ్రామానికి చెందిన గొల్ల రమేష్ దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో కుమాడురు 13  ఏళ్ల హరికృష్ణ అనంతపురంలోని రామన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే నాలుగేళ్ల నుంచి హరికృష్ణ అదే పాఠశాలలోని హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే బుధవారం రోజు ముద్దలాపురంలోని ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉన్న హరికృష్ణ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంట్లోని ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం నుంచి వచ్చిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చే సరికి తలుపులు వేసి ఉన్నాయి. హరికృష్ణను ఎంత పిలిచినా తలుపులు తెరవకపోవడంతో వాళ్లే పగులగొట్టి చూశారు. అయితే లోపలికి వెళ్లిన తల్లిదండ్రులకు ఉరికి వేలాడుతున్న కుమారుడు కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు ఇద్దరూ కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు. వారు ఏడుపు విన్న స్థానికులు అక్కడకు చేరుకొని విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన కూడేరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. 


కరస్పాండెంట్ రామాంజనేయులు వల్లే మా కుమారుడు చనిపోయాడు..


అయితే తమ కుమారుడు హరికృష్ణ మృతికి రామన్ స్కూల్ కరస్పాండెంట్ రామాంజనేయులే కారణం అని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఉద్దేశ పూర్వకంగానే రామాంజనేయులు తమ కుమారుడిపై దాడి చేశాడని, చిత్ర హింసలు పెట్టి ఆత్మహత్యకు పాల్పడేలా చేశాడని పోలీసులకు తెలిపారు. అయితే బుధవారం రోజు పాఠశాల నుంచి తమకు ఫోన్ చేసి మీ కుమారుడు మా పాఠశాలలో ఉండాల్సిన అవసరం లేదు, వచ్చి తీసుకుపోండని చెప్పినట్లు తెలిపారు. తాము బడికి వెళ్లకపోవడంతో తమ కుమారుడినే ఇంటికి పంపించారని చెప్పారు. అయితే ఇంటికి వచ్చినప్పటి నుంచి తమ కుమారుడు దిగాలుగా ఉన్నాడని, కరస్పాండెంట్ తనను అందరి ముందు కొట్టి అవమానించాడని పదే పదే వేదన చెందాడని చెప్పారు. నీకు నచ్చకపోతే వద్దు ఇంట్లోనే ఉండి చదువుకోమని చెప్పి తాము గురువారం ఉదయం పొలం పనులకు వెళ్లామని తండ్రి రమేష్ వివరించాడు. 


పొలం పనులు ముగించుకొని వచ్చే సరికే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటూ శోక సంద్రంలో నిండిపోయారు. తమ కుమారుడి మృతికి కారణం అయిన స్కూల్ కరస్పాండెంట్ రామాంజనేయులను కఠినంగా శిక్షించాలని కోరారు. మరోవైపు విద్యార్థి సంఘాల నాయకులు కూడా హరికృష్ణ మృతికి కారణం అయిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే కాసేపు పాఠశాల భవనం ముందు ఆందోళన చేపట్టారు.