Anantapur News : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గత కొన్నేళ్లుగా హత్యలు, కిడ్నాప్ లతో భయాందోళనలకు గురి చేస్తున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుంకర ప్రసాద్ నాయుడు ముఠాను గుంతకల్లు పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు.  ఈ ముఠా లీడర్ సుంకర ప్రసాద్ నాయుడు సహా 13 మందిని అరెస్టు చేసినట్లు అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుల నుంచి ఒక ఫిస్టోల్, 16 తుటాలు, స్కార్పియో, ఇటియాస్, బుల్లెట్ వాహనాలతో పాటు రూ.6.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.



మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ 


అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం జి.కొట్టాలకు చెందిన కోనంకి వెంకటేష్ ను డబ్బు కోసం ఈనెల 20వ తేదీన సుంకర ప్రసాద్ నాయుడు ముఠా కిడ్నాప్  చేసిందని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. కిడ్నాప్ చేసి డోన్ సమీపంలోని ఓబుళాపురం మిట్టలో దాచి కోటి రూపాయలు తీసుకురావాలని లేదంటే చంపుతామని బాధిత కుటుంబ సభ్యులకు బెదిరించారన్నారు. గుంతకల్లు డీఎస్పీ యు.నరసింగప్ప, గుంతకల్లు రూరల్ సి.ఐ లక్ష్మణ్ ల ఆధ్వర్యంలో ఈ కిడ్నాప్ కేసును దర్యాప్తు చేసి పక్కా సమాచారంతో డోన్ సమీపంలోని ఓబుళాపురం మిట్టపై కిడ్నాపర్ల ముఠాను అరెస్టు చేసి బాధితుడిని రక్షించారని తెలిపారు. ఈ ఘటనతో పాటు గత నెల 29న స్వామీజీ ముత్యాల గంగరాజును కిడ్నాప్ చేసి రూ. 24 లక్షలు డిమాండ్ చేసి వసూలు చేశారన్నారు.



రెండు దశాబ్దాల నేర చరిత్ర


రెండు దశాబ్దాలకు పైగా నేర చరిత్ర ఉన్న సుంకర ప్రసాద్ నాయుడిపై రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు 11 కేసులు ఉన్నట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు. వీటిలో హత్యలు, కిడ్నాప్ లు, బలవంతపు వసూళ్లు, దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. గుంతకల్లు మండలం జి.కొట్టాలకు చెందిన మోహన్ నాయుడు ఈ ముఠా నాయకుడి యూట్యూబ్ ఇంటర్వూలతో ఆకర్షణకు గురయ్యాడన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో హత్యలు, కిడ్నాపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడిన సుంకర ప్రసాద్ నాయుడి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న గుంతకల్లు డీఎస్పీ బృందాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి  అభినందించారు. సుంకర ప్రసాద్ నాయుడు ముఠా చేతుల్లో ఈ తరహా ఇబ్బంది పడిన బాధితులు పోలీసులు సంప్రదించాలని ఎస్పీ సూచించారు. 


Also Read : Karimnagar: బంధువు హత్యకు పక్కా ప్లాన్, పోలీసుల ఎంట్రీతో సీన్ తారుమారు - వీళ్లది మామూలు స్కెచ్ కాదు