అనంతపురం:  అనంతపురం ఓపెన్ఎయిర్ జైలు జైలర్ సుబ్బారెడ్డి న్యూడ్ కాల్స్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఉన్నత స్థాయి పోలీసు అధికారి అయ్యుండి ఒక మహిళతో అసభ్యకరంగా న్యూడ్ కాల్స్ తో వేధిస్తున్నాడని సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మొత్తం వ్యవహారం అంతా బట్టబయలు కావడంతో జైలర్ సుబ్బారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు.  న్యూడ్ కాల్ చేయాలని ఓ మహిళను ఒత్తిడి చేసినందుకు జైలర్ సుబ్బారెడ్డిపై విశాఖ సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో గత నెలలో కేసు నమోదైంది.

ప్రైవేట్ కాల్స్ చేయాలని మహిళపై ఒత్తిడి..

గతంలో విశాఖపట్నంలో ఓ ఫంక్షన్కు వెళ్లిన జైలర్ సుబ్బారెడ్డి అక్కడ ఓ మహిళతో పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆ పరిచయం తోనే ఫోన్ నెంబర్ తీసుకొని తరచూ మహిళతో మాట్లాడుతూ డబ్బులు ఆశ చూపించాడు. అనంతరం ప్రైవేట్ కాల్స్ చేయాలని ఆ మహిళను తీవ్ర ఒత్తిడికి గురి చేశాడని మహిళా ఆరోపించింది. ఇదే విషయంపై విశాఖపట్నం సి పి కి ఫోన్ కాల్ ద్వారా సదరు మహిళ కంప్లైంట్ ఇవ్వడంతో జైలర్ సుబ్బారెడ్డి పై విచారణ చేపట్టారు.  సుబ్బారె డ్డిని విచారించేందుకు విశాఖ నుంచి ప్రత్యేక పోలీసు బృందం అనంతపురం ఓపెన్ ఎయిర్ జైలుకు మార్చి 23న వచ్చినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన ఆయన. పోలీసుల కంటపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

మార్చి 23 నుంచి అతను విధులకు హాజరు కావడం లేదని జైలు సూపరిండెంటెంట్ ఏబీ క్రాంతి రాజ్ తెలిపారు. మార్చి 22న విధి నిర్వహణలో ఉన్నాడని, మరస టిరోజు డ్యూటీకి రాలేదని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని తెలిపారు.  అదే రోజున వేరే నంబర్ నుంచి ఫోన్ చేసి, మెడికల్ లీవ్ ఇవ్వాలని కోరాడని తెలిపారు. అనంతరం జైళ్ల శాఖకు మెయిల్ ద్వారా మార్చి 23 నుంచి ఏప్రిల్ 11 వరుకు సెలవు ఇవ్వాలని లేఖ పంపించారని తెలిపారు. ఆయన కుటుంబం కూడా అందుబాటులో లేదని అన్నారు. సుబ్బా రెడ్డి మెడికల్ లీవ్ శుక్రవారంతో ముగిసింది. ఆయన విధులకు రాగానే సమా చారం ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్ క్కు విశాఖ పోలీసులు సూచించారని సమాచారం.

ఎవరీ సుబ్బారెడ్డి..?

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి జైళ్ల శాఖలో 2010 డిప్యూటీ జైలర్గా ఉద్యోగంలో చేరాడు. 2019లో జైలర్గా ఉద్యోగోన్నతి పొందారు.  గుంటూరు జిల్లా గురుజాల సబ్ జైలు జైలర్గా పనిచేస్తున్న సమయంలో అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అనంతపురం ఓపెన్ ఎయిర్ జైలు పరిపాలనా విభాగానికి ఈ ఏడాది జనవరి 27న డెప్యుటేషన్ పై పంపించారు. ఫిబ్రవరి 1న అనంతపురం ఓపెన్ఎయిర్ జైలులో విధుల్లో చేరారు.