Andhra Pradesh: అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన దెయ్యం శివారెడ్డి హత్య కేసులో ఏడు మందికి రెండు జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష విధించింది అనంతపురం జిల్లా న్యాయస్థానం. అంతే కాకుండా ఒక్కొక్కరికి 10వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. సోమవారం సంచలన తీర్పు రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది.ఈ కేసులోని ముద్దాయిలు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు. 
 


ఆరోజు ఏం జరిగింది : 
అనంతపురం రూరల్ మండలం కందుకూరు గ్రామానికి చెందిన దెయ్యం శివారెడ్డి రైతు. గ్రామంలో శ్రీ మోక్షన్ పేరుతో ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ నడుపుకుంటూ జీవనం చేస్తున్నారు. రాజకీయలపై ఆసక్తితో వార్డు మెంబరుగా గెలిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నారు. శివారెడ్డి హత్య జరగకముందు 5 నెలల  క్రితం కందుకూరు గ్రామంలో పీర్ల పండుగ జరిగింది. అదే గ్రామానికి చెందిన బోయ సాకే బాలకృష్ణ అతని కుటుంబ సభ్యులు పీర్ల పండుగ సందర్భంగా అలాయ్ తొక్కుతున్నారు. 


పండగ వేళ నీటి సరఫరా కోసం నీళ్ల ట్యాంక్ ఆటోను తీసుకొని గ్రామంలోకి వచ్చాడు శివారెడ్డి. బాలకృష్ణ అతని తమ్ముళ్లు దారి ఇవ్వకుండా అడ్డుకొని శివారెడ్డితో గొడవ పెట్టుకున్నారు. ఆ గొడవలో శివారెడ్డితోపాటు బాలకృష్ణ, నరసింహారెడ్డికి గాయాలైనాయి. ఆ గలాటాలో బాలకృష్ణ పంచె కూడా  ఊడిపోయింది. డ్రాయర్ లేని కారణంగా అతనికి గ్రామంలో అవమానం జరిగింది. 


ఈ వివాదం కేసుల వరకు వెళ్లింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. కొద్ది కాలం తర్వాత ఇరువర్గాలు రాజీపడి లోక్ అదాలత్ ద్వారా కేసులు కొట్టి వేయించుకున్నారు. అయితే బాలకృష్ణ మాత్రం తనకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అది మనసులో పెట్టుకొని,  కక్ష పెంచుకొని శివారెడ్డిని చంపుతానని పదే పదే చెబుతూ అవకాశం కోసం ఎదురు చూశాడు. 


హత్య జరిగిన రోజు : 
2018 మార్చి 30 సాయంత్రం 5:30 గంటల సమయంలో శివారెడ్డి అతని కుమారుడు భాను ప్రకాశ్ రెడ్డి  పొలం నుంచి వస్తున్నారు. అంకె భీముడు అనే వ్యక్తి పొలం వద్దకు వచ్చేసరికి వారిని బాలకృష్ణ, అతని తమ్ముడు విక్రం ఆపారు. భాను ప్రకాశ్ రెడ్డి ఆపకుండా పోనిచ్చాడు. బాలకృష్ణ అతని రమేష్, అశోక్, సూర్యనారాయణ వారిని వెంబడించారు. మరొక టూవీలర్‌తో వారిని పడేశారు. కింద పడిపోయిన భాను ప్రకాశ్ రెడ్డి, శివారెడ్డిపై బాలకృష్ణ గ్యాంగ్ వేట కొడవళ్ళతో దాడి చేసింది. నాన్నను చంపొద్దని భాను ప్రకాష్ రెడ్డి వేడుకొన్నా వదల్లేదు. అతన్ని చంపడానికి ట్రై చేశారు. కానీ చుట్టుపక్కల వాళ్లు రావడంతో బాలకృష్ణ అతని ఫ్యామిలీ పరారైంది. శివారెడ్డి తీవ్ర రక్త గాయాలతో అక్కడికక్కడే చనిపోయినాడు. తండ్రిని చంపిన వారిపై భాను ప్రకాశ్ రెడ్డి ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్‌ ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 147, 148, 307, 302 r/w. 149 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


పోలీసు దర్యాప్తు : 
పోలీసులు కేసు దర్యాప్తు చేసి, చంపిన వారి పైన, వారికి ఆర్థికంగా సహాయం చేసి, ఆశ్రయం కల్పించిన వారిపైన మొత్తం 12 మందిపై కేసులు పెట్టారు. అరెస్టు చేసి చార్జిషీటు దాఖలు చేశారు. ఇందులో ఇద్దరు మైనర్‌లు కేసు జువెనైల్ కోర్టులో నడుస్తోంది. మిగిలిన 10 మందిపై నమోదైన కేసు విచారణ అనంతపురం జిల్లా సెషన్స్ కోర్టులో సాగింది. ప్రాసిక్యూషన్ తరపున 12 మంది సాక్షులను విచారించగా వారిపై నేరం రుజువైంది. 


నేరం రుజువు కావడంతో నిందితులకు రెండు జీవిత కాలాల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ తీర్పు చెప్పారు. మిగతా ముగ్గురిపై నేరం ఋజువు కానందున వారిపై కేసు కొట్టివేశారు. ఈ కేసులో శిక్ష పడిన 6 మందిలో సూర్యనారాయణ మినహా మిగిలిన వారంతా స్వయానా అన్నదమ్ములే. వారందరూ రౌడీషీటర్లే. అప్పట్లో రాజకీయంగా కూడా ఈ కేసు సంచలనంగా మారటంతో.. నేడు ఈ కేసులో తీర్పు రావటం తో ప్రాధాన్యత సంతరించుకుంది.


Also Read: లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌లు- సమగ్ర విచారణ కోరిన వైసీపీ, బీజేపీ నేతలు