Attack on TDP leader Bhaskar Reddy in Allagadda | ఆళ్లగడ్డ: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు పూర్తయి నెల రోజులు గడుస్తున్నా దాడులు ఆగడం లేదు. ఫలితాలు సైతం విడుదలై మూడు వారాలు గడుస్తున్నా రాజకీయ కక్షలతో వేధింపులు, దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నంద్యాల జిల్లాలో టీడీపీ నేత భార్య హత్యకు గురైంది. టీడీపీ నేత తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వ్యక్తిగత కక్షలా, ఆస్తి తగాదాలా, రాజకీయ దాడులా అనేది తేలాల్సి ఉంది.


నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో టీడీపీ నేత ఏవీ భాస్కర్‌రెడ్డి, శ్రీదేవి దంపతులపై కొందరు గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. ప్రత్యర్థుల దాడిలో భార్య శ్రీదేవి మృతి చెందగా, భర్త భాస్కర్‌రెడ్డి సైతం తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీదేవి మృతదేహాన్ని ఆళ్లగడ్డలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆసుపత్రికి వెళ్లి బాధితుడు భాస్కర్ రెడ్డిని పరామర్శించారు. భార్య మృతి చెందడంతో కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ నేతకు ఆమె ధైర్యం చెప్పారు. ఈ దాడి ఘటనపై పోలీసులతో మాట్లాడిన ఎమ్మెల్యే అఖిల ప్రియ.. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.