పరీక్షల భయం ఓ విద్యార్థిని ప్రాణం తీసింది. నిజామాబాద్‌లో జరిగిన ఈ దుర్ఘటన అందర్నీ విషాదంలో నింపింది. స్థానిక  వీఆర్‌ఈసీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని పరీక్షల భయంతో బిల్డింగ్‌పై నుంచి దూకేసింది. 


నిజామాబాద్‌లోని వీఆర్‌ఈసీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న పదిహేడేళ్ల అక్షిత సూసైడ్‌ చేసుకోవడం కలకలం రేపింది. పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న అక్షిత ఆదివారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ హాస్టల్‌ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. 
అక్షిత సూసైడ్ విషయం గమనించిన తోటి విద్యార్థులు విషయాన్ని కాలేజీ సిబ్బందికి చెప్పారు. వెంటనే ఈ స్పందించిన ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అక్షిత మృతి చెందింది. అక్షిత పాలిటెక్నిక్‌ ఈసీఈ విద్యార్థిని. ఇటీవలే మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఆమె ఒక సబ్జెక్ట్‌లో తప్పింది.  


మొదటి సెమిస్టర్‌లోనే ఒక సబ్జెక్ట్‌ తప్పిన అక్షితకు పరీక్షలంటేనే భయం పట్టుకుంది. తరచూ తోటి స్నేహితుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించేది. రేపటి(మంగళవారం) నుంచి రెండో సమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందులో ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో సూసైడ్ చేసుకుంది. 
అయితే అక్షిత మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదని... పరీక్షలు అంటే ఎప్పుడూ భయపడేది కాదని అంటున్నారు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.