Plane Truck Collide in New York | న్యూయార్క్: న్యూయార్క్ లోని లా గార్డియా విమానాశ్రయంలో భారీ ప్రమాదం జరిగింది. ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ విమానం ఎయిర్‌పోర్టులో నిలిపి ఉంచిన ట్రక్కును ఢీకొనడంతో 70 మంది వరకు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం (మార్చి 23)న ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు.
రన్‌వే పై నిలిచి ఉంచిన ట్రక్కును ఢీకొన్న విమానం..
రాయిటర్స్ నివేదిక ప్రకారం, యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక నోటీసును విడుదల చేసింది. ప్రస్తుతం అన్ని విమానాలకు గ్రౌండ్ స్టాప్ ఉంటుందని, అంటే ఏ విమానం కూడా ఫ్లై చేయలేదని తెలిపింది. ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్ విమానం విమానాశ్రయంలో రన్ వే పై నిలిపి ఉంచిన అగ్నిమాపక వాహనాన్ని ఢీకొనడంతో విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతినగా.. ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారు.
రన్‌వే 04/22ను దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, ఎయిర్ కెనడా CRJ ఫ్లైట్ AC8646 విమానం 'ట్రక్ 1'గా గుర్తించిన ఒక ఫైర్ ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఫ్లైట్-ట్రాకింగ్ డేటా ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ కెనడా విమానం రన్‌వేపై కదులుతూ ఉంది. ఈ ఘటన తర్వాత విమానానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
