Alliances battle for seats in Tamil Nadu Assembly elections: తమిళనాడులో డీఎంకే , అన్నాడీఎంకే సీట్ల సర్దుబాటు ప్రక్రియలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పీఠాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ సీట్ల పంపిణీలో వేగం పెంచింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఇప్పటికే తన ప్రధాన మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు 28 సీట్లు కేటాయించి ఒప్పందాన్ని ఖరారు చేశారు. అయితే, కాంగ్రెస్ మొదట 45 సీట్లు డిమాండ్ చేసినప్పటికీ, కొత్తగా వచ్చి చేరిన కమల్ హాసన్ వంటి పార్టీలకు చోటు కల్పించాల్సి రావడంతో డీఎంకే పట్టుబట్టి తగ్గించింది. కాంగ్రెస్‌కు అదనంగా ఒక రాజ్యసభ స్థానాన్ని ఇస్తామని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఆ వివాదం సద్దుమణిగింది.
మిత్రపక్షాలకు సీట్లు తగ్గిస్తున్న డీఎంకే
కమ్యూనిస్టు పార్టీల విషయంలో డీఎంకే కొంత కఠినంగా వ్యవహరిస్తోంది. సీపీఐ కి 5 సీట్లు కేటాయించగా, గతంలో కంటే ఒక సీటు తగ్గించడంపై ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీపీఎం తమకు కనీసం 6 సీట్లు కావాలని భీష్మించుక కూర్చుంది. దళిత పార్టీ వీసీకే కూడా తమకు రెండంకెల సీట్లు కావాలని డిమాండ్ చేస్తోంది. అయితే, డీఎంకే మాత్రం కనీసం 170 నుండి 180 స్థానాల్లో స్వయంగా పోటీ చేయాలని భావిస్తుండటంతో, మిత్రపక్షాలకు తక్కువ సీట్లు ఇచ్చి సర్దుబాటు చేసేందుకు స్టాలిన్ టైట్ రోప్ వాక్ చేస్తున్నారు.
అన్నాడీఎంకేపై బీజేపీ ఒత్తిడి
ప్రతిపక్ష అన్నాడీఎంకే కూటమిలో సమీకరణాలు మరింత క్లిష్టంగా ఉన్నాయి. ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో అన్నాడీఎంకే.. బీజేపీ , పీఎంకే తో కలిసి పటిష్టమైన కూటమిని ఏర్పాటు చేసింది. పీఎంకే ఇప్పటికే కూటమిలోకి అధికారికంగా చేరినప్పటికీ, ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఉత్తర తమిళనాడులో పట్టున్న పీఎంకే, సామాజిక వర్గాల ప్రాతిపదికన కీలక సీట్ల కోసం పట్టుబడుతోంది. అటు బీజేపీ కూడా గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు ఆశిస్తోంది, కానీ అన్నాడీఎంకే మాత్రం మెజారిటీ సీట్లను తన వద్దే ఉంచుకోవాలని చూస్తోంది.
అసంతృప్తులకు చాయిస్ విజయ్ టీవీకే
డీఎంకే కూటమిలోని కమల్ హాసన్ పార్టీ MNM తమ సొంత గుర్తు మీదనే పోటీ చేస్తామని, డీఎంకే గుర్తుపై కాదని స్పష్టం చేయడం కూటమిలో చిన్నపాటి చిచ్చుకు దారితీసింది. అలాగే, సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత దక్కని చిన్న పార్టీలు అన్నాడీఎంకే లేదా కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన విజయ్ పార్టీ వైపు చూస్తున్నాయి. ముఖ్యంగా డీఎంకే తిరుగుబాటు నేతలు కొందరు అన్నాడీఎంకేతో టచ్‌లోకి వెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారింది. నటుడు విజయ్ ఏర్పాటు చేసిన తమిళగ వెట్రి కజగం ఈసారి ఎన్నికల్లో ఎక్స్-ఫ్యాక్టర్ గా మారనుంది. ఆయన ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా వెళ్తారా లేక ఆఖరి నిమిషంలో ఏదైనా కూటమికి మద్దతు ఇస్తారా అన్నది సస్పెన్స్‌గా మారింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, సీట్ల సర్దుబాటులో అసంతృప్తికి లోనైన చిన్న పార్టీలు విజయ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇది ప్రధాన కూటముల ఓట్లను చీల్చే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్‌కు ముందు ఈ నెల ఆఖరుకల్లా రెండు కూటములు తమ పూర్తి అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటులో వచ్చే అసంతృప్తులు అభ్యర్థుల గెలుపు ఓటములపై ఎంతవరకు ప్రభావం చూపుతాయో చూడాలి.
