UP Man accepts challenge to drink liquor bottles and dies: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. సరదా కోసం వేసుకున్న పందెం ఓ వ్యక్తి ప్రాణాలు బలితీసుకుంది. మద్యం తాగడమే ఆరోగ్యానికి హానికరం అని చెబుతారు. అలాంటిది బెట్ కాసి మరీ తక్కువ సమయంలో మద్యం తాగిన ఓ వ్యక్తి గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన యూపీలోని ఆగ్రాలో జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఆగ్రా పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు.


45 ఏళ్ల వ్యక్తి జై సింగ్ యూపీలోని ఆగ్రాలో నివాసం ఉంటున్నాడు. ఈ-రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న జై సింగ్ కు తాగుడు అలవాటు ఉంది. ఈ క్రమంలో ఇద్దరు స్నేహితులతో చర్చ మొదలై బెట్టింగ్ కు వెళ్లింది. 10 నిమిషాల సమయంలో దేశీ మద్యం మూడు క్వార్టర్లు తాగేయాలని పందెం కాశారు అతని ఇద్దరి స్నేహితులు భోలా, కేశవ్. ఒకవేళ జై సింగ్ ఆ పందెంలో ఓడిపోయినట్లయితే స్నేహితులు ఎంత తాగితే అంత బిల్లు తానే చెల్లిస్తానని పందెం అంగీకరించాడు. మొత్తం మూడు క్వార్టర్స్ (ఒక్కో క్వార్టర్ 180 మి.లీ) కేవలం 10 నిమిషాల్లో తాగేస్తానని చెప్పిన జై సింగ్ సాధ్యమైనంత త్వరగా మద్యం తాగడం పూర్తిచేసి ఛాలెంజ్ లో నెగ్గాలని భావించాడు జై సింగ్. కానీ గుటగుటా మూడు క్వార్టర్లు తాగిన జై సింగ్ కొన్ని నిమిషాల్లోనే అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి అర్థం చేసుకున్న స్నేహితులు జై సింగ్ ను వదిలేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో శిల్పగ్రామ్ సమీపంలోని రోడ్డు పక్కన అతని 16 ఏళ్ల కుమారుడు కరణ్ వకు తన తండ్రి అపస్మారక స్థితిలో కనిపించాడు.


కుటుంబసభ్యులకు సమాచారం తెలిపిన కరణ్ తన తండ్రిని మొదట్లో సమీపంలోని రెండు ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లాడు. కానీ ఆ పరిస్థితుల్లో అతనికి చికిత్స చేయడానికి హాస్పిటల్స్ నిరాకరించాయి. అనంతరం ఎస్‌ఎన్‌ మెడికల్‌ కాలేజీకి తీసుకెళ్లగా జై సింగ్ మృతి చెందినట్లు ప్రకటించారు. తక్కువ సమయంలో లిమిట్ కు మించి అధికంగా మద్యం సేవించడం వల్ల ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో బెట్టింగ్ కాసిన స్నేహితులైన భోలా, కేశవ్‌లపై ఐపీసీ సెక్షన్ 304 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


మద్యం తాగాలని పందెం కాసి జై సింగ్ మృతికి కారకులైన భోలా, కేశవ్‌లను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ బహదూర్ సింగ్ తెలిపారు. విచారణలో, నిందితులు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 8న జైతో కలిసి శిల్పగ్రామ్ పార్కింగ్ సమీపంలో మద్యం తాగడానికి వచ్చామని చెప్పారు. 10 నిమిషాల్లో 3 క్వార్టర్స్ తాగడం సాధ్యమేనా అని చర్చకు రాగా, జై సింగ్ ఛాలెంజ్ అంగీకరించాడని చెప్పారు. ఈ క్రమంలో పది నిమిషాల్లో మూడు క్వార్టర్ బాటిల్స్ తాగిన వెంటనే జై సింగ్ తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడని నిందితులు చెబుతున్నారు.


చనిపోయిన జై సింగ్ కి నలుగురు సంతానం కాగా, వారందరూ మైనర్లు. ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జై సింగ్ సోదరుడు సుఖ్‌బీర్ సింగ్ మాట్లాడుతూ.. భోలా, కేశవ్‌లు తన సోదరుడికి గత 10 సంవత్సరాలకు స్నేహితులుగా ఉన్నారని చెప్పాడు. తన సోదరుడు మద్యం సేవించి ఆరోగ్యం క్షీణించిందన్న విషయం తెలిసి, ఈ రిక్షా కోసం చెల్లించేందుకు అతడి వద్ద ఉన్న రూ.60 వేల నగదు కూడా తీసుకుని పరారయ్యారని వెల్లడించాడు. ఈ కారణంగా జై సింగ్ చనిపోయాడని, అందుకు అతడి స్నేహితులు కారణమని ఆరోపించాడు.