Afghan Taliban Minister Khalil Rahman Haqqani Killed In Kabul Blast | కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో విషాదం చోటుచేసుకుంది. కాబూల్‌లో సంభవించిన భారీ పేలుడులో ఆఫ్ఘన్ తాలిబాన్ శరణార్థుల మంత్రి ఖలీల్ రహ్మాన్ హక్కానీ దుర్మరణం చెందారు. మంత్రి సహా మొత్తం 12 మంది వరకు చనిపోయారు. మంత్రి ఖలీల్ హక్కానీ మరణించిన విషయాన్ని ఆయన మేనల్లుడు అనాస్ హక్కానీ బుధవారం వెల్లడించారు.
ప్రభుత్వంలో ఖలీల్ హక్కానీ కీలక పాత్ర
2021లో ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా బలగాలు ఉపసంహరించుకున్న తరువాత ఏర్పాటైన ప్రభుత్వంలో ఖలీల్ హక్కానీ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాలిబాన్ ప్రభుత్వంలో శరణార్థుల శాఖ మంత్రిగా హక్కానీ సేవలు అందిస్తున్నారు. దేశం నుంచి ప్రజల వలసలు నియంత్రణను ఈయన పర్యవేక్షించేవారు. కాబూల్‌లోని మంత్రి కార్యాలయం వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో మంత్రి ఖలీల్ హక్కానీ, ఆయన సెక్యూరిటీ సిబ్బంది సహా మొత్తం 12 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు అఫ్గాన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
గతంలోనే ప్రస్తావించిన అమెరికా
ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన పలు దాడులు, బాంబు పేలుళ్లలో ఖలీల్ హక్కానీ హస్తం ఉంది. అమెరికా విదేశాంగ శాఖ ఈ విషయాన్ని గతంలోనే ప్రస్తావించింది. అమెరికా నాటో బలగాలు 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వైదొలగిన అనంతరం తాలిబాన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు నరకం చూపించారు. తాలిబాన్ చట్టాలతో మహిళలకు అధికంగా నష్టం జరిగింది. స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా పరిపాలిస్తామని తాలిబన్ నేతలు చెప్పినా, ఎలాంటి మార్పు రాలేదు. నేటికి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంకా బాంబు దాడులు, పేలుళ్లు కొనసాగుతూనే ఉన్నాయి.