Acb Raids At MRO office of Mavala:


ఆదిలాబాద్: పట్టా పాస్ బుక్ లో వివరాలు సవరించేందుకు లంచం తీసుకుంటున్న ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ చేతికి చిక్కారు. భూమికి సంబంధించిన వివరాలు పట్టా పాస్ బుక్ లో మార్చేందుకు రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. లంచం తీసుకుంటున్న ఎమ్మార్వో ఆరిఫా సుల్తానా, ఆర్ఐ హన్మంతరావులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే..
ఆదిలాబాద్ జిల్లాలోని మావల తాహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆదివారం సోదాలు నిర్వహించారు. ఆదిలాబాద్ టౌన్ కు చెందిన ఓ వ్యక్తి నుంచి మావల తహసీల్దార్ ఆరిఫా సుల్తానా, ఆర్.ఐ హనుమంత్ రావు రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. దీనిపై ఏసీబీ అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు.  


మావల మండలంలో 14 ఎకరాల భూమికి సంబంధించిన వివరాలను నాలుగు పట్టా పాస్ బుక్ లలో సవరించాల్సి ఉంది. దీనికోసం యతీంద్రనాథ్ యాదవ్ జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకున్నాడు. తప్పులను సవరించేందుకు మావల తహశీల్దార్ ఆరిఫా సుల్తానా, ఆర్.ఐ హనుమంతరావు రెండు లక్షలు డిమాండ్ చేశారు. ఎమ్మార్వో చేస్తేనే పని అవుతుందని భావించిన బాధితుడు యతీంద్రనాథ్ ఏసీబీకి అధికారులను ఆశ్రయించాడు.


ఈ క్రమంలో మావల ఎమ్మార్వో ఆఫీసులో బాధితుడు రూ.2 లక్షల నగదు లంచంగా సమర్పించాడు. ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేసి ఎమ్మార్వో ఆరిఫా సుల్తానా, ఆర్ఐ హన్మంతరావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏసీబీ డీఎస్సీ రమణ మూర్తి తెలిపారు. బాధితుడి వద్ద నుండి లంచం తీసుకుండగా ఇద్దరు పట్టుబడినట్లు తెలిపారు. ఎమ్మార్వో ఆఫీసులోని ల్యాప్ టాప్ లో వివరాలు సైతం పరిశీలించారు. అనంతరం లంచం తీసుకున్న ఈ ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు.