Hyderabad News: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. నువ్వు లేకపోతే చచ్చిపోతానని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడు. ఏళ్ల తరబడి ప్రేమ కోసం వెనకాలే తిరుగుతున్నాడని కరిగిపోయింది. ఇంట్లోవాళ్లు వద్దని చెప్పినా వినలేదు. ప్రేమించింది. అంతే అప్పటి నుంచి ఆ వ్యక్తి అసలు రూపం బయటపడింది. ఇంకేం చేయలేక ఆ బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ లెటర్ ఎందరో యువతులకు కనువిప్పు కలిగేలా ఉంది. 


అమ్మా నాన్ని క్షమించండి... మీరు కాదన్నా నేను అతన్ని ప్రేమించాను. ఎప్పటి నుంచో వెంటపడుతున్నాడు... మంచివాడేమో అని నమ్మాను.  ఇప్పుడు మోసపోయాను. మోసాన్ని దిగమింగి బతకలేకపోతున్నా అంటూ ఆమె రాసిన లేఖ ఇప్పుడు కన్నీరు పెట్టిస్తోంది. 


హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిధిలో న్యూఎల్‌బినగర్‌లో ఈ దారుణం జరిగింది. అఖిల అనే అమ్మాయిని అఖిల్‌ సాయిగౌడ్ అనే యువకుడు ప్రేమించాడు. ఏళ్ల తరబడి వెంటపడ్డాడు. నీ తోడు లేకపోతే బతకలేనంటూ కలరింగ్ ఇచ్చాడు. అఖిల్‌ సిన్సియారిటీకి అఖిల పడిపోయింది. 


అఖిల్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అఖిల లవ్ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పింది. వాళ్లు మాత్రం అంగీకరించలేదు. అతనిపై అనుమాన పడ్డారు. మంచివాడని ఇంట్లో వాళ్లను కూడా ఒప్పించింది. అఖిల, అఖిల్ పెళ్లికి వాళ్లు కూడా అంగీకరించారు. 


ఇక్కడే ట్విస్ట్ ఇచ్చాడు అఖిల్. అప్పటి వరకు అపరిచితుడిలోని రామ్‌ లెక్క బిహేవ్ చేసిన అఖిల్‌... తన ప్రేమకు గ్రీన్ సిగ్నల్‌ పడ్డ తర్వాత మారిపోయాడు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. చిన్న చిన్న వాటికి కూడా అఖిలను కొట్టడం ప్రారంభించాడు. రోడ్లపై గొడవ పడటం జరిగేది. 


అప్పటి ఇంట్లో వాళ్లకు ప్రేమ విషయాన్ని చెప్పి బలవంతంగా ఒప్పించిన అఖిల.... ప్రియుడి అసలు స్వరూపాన్ని చెప్పలేకపోయింది. చాలా కాలంగా భరిస్తూనే వచ్చింది. అవి శ్రుతి మించిపోవడంతో తల్లిదండ్రుల దృష్టికి కూడా తీసుకెళ్లింది. త్వరగా పెళ్లి చేసేస్తే అన్నీ సర్దుకుంటాయని వాళ్లు అనుకున్నారు.


ఇరు కుటుంబాలు ఓ అంగీకరానికి వచ్చాయి. పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నాయి. అయితే పెళ్లి పేరు చెబితేనే అఖిల్‌ ప్రవర్త పూర్తిగా మారిపోయింది. పెళ్లి వద్దంటే వద్దని గొడవ పడేవాడు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పటి నుంచి మొహం చాటేశాడు. 


అఖిల్‌ను ప్రేమించి మోసపోయానని గ్రహించిన అఖిల మానసికంగా పూర్తిగా కుంగిపోయింది. అంతే సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకొని పది పేజీల లేఖ రాసింది. తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతూ ఆమె రాసిన ఈ సూసైడ్‌ నోట్‌ ప్రేమ పేరుతో ఆకర్షణకు లోనవుతున్న యువతకు కనువిప్పు. 


కుమార్తె సూసైడ్ విషయాన్ని తెలుసుకున్న అఖిల తల్లిదండ్రులు బోరున విలపించారు. వద్దని చెప్పినా అఖిల్‌ను ప్రేమించి ప్రాణాల మీదకు తెచ్చుకుందని వాపోయారు. అఖిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.