"అసలే కోతి ఆపై కల్లు తాగిందనే" సామెత తెలుగులో ఉంది. అసలే ముక్కోపి.. ఆపై చేతిలో గన్ను అన్నట్లుగా ఈ సామెతను మార్చుకుని అమృత్ సర్‌కు చెందిన మనీ ధిల్లాన్ అనే యువకుడికి వాడుకోవాలి. ఎందుకంటే పుట్టి రోజు వేడుకకు వెళ్లిన ధిల్లాన్  అక్కడ తన మొహానికి కేక్ పూశారని ఇద్దర్ని కాల్చి చంపేశాడు మరి. అమృత్ సర్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. 


పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని మజిత రోడ్డులోని ఓ హోటల్‌లో తరుణ్ ప్రీత్ సింగ్ అనే కుర్రాడు పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేసుకున్నాడు. తన స్నేహితులందర్నీ ఆహ్వానించాడు. అందరూ వచ్చారు. దాదాపుగా 30 మంది కుర్రాళ్లు.. అందరూ ఇరవై ఏళ్ల లోపు వాళ్లే. బర్త్ డే పార్టీని ఎంజాయ్ చేశారు.చివరికి మన్ ప్రీత్ కేక్ కట్ చేశారు. అంత వరకూ అందరూ బాగానే ఎంజాయ్ చేశారు. స్నేహితులు అందరూ మన్‌ప్రీత్‌కు కేక్ ముక్కనోట్లో పెట్టడంతో పాటు కాస్తంత మొహానికి కూడా పూస్తున్నారు. అది కామనే కాబట్టి అందరూ అలాగే చేస్తున్నారు. అలాగే మనీ ధిల్లాన్ కూడా తన మిత్రుడికి కేక్ తినిపించాడు. కాస్త మొహానికి పూశాడు. అంత వరకూ బాగానే ఉంది కానీ కొంత మందిమిత్రులు అక్కడే కాస్త అడ్వాంటేజ్ తీసుకున్నారు. కేక్ ముక్క తీసుకుని మనీ ధిల్లాన్ మొహానికి కూడా పూశారు. 


తన స్నేహితులు తనకు కేక్ పూయడం మనీ ధిల్లాన్‌కు నచ్చలేదు. దీంతో  వారితో వాగ్వాదం పెట్టుకున్నాడు. అందరూ మిత్రులే కదా అని వారు కూడా సరదానే ఎదురు చెప్పడం ప్రారంభించారు. మిత్రులంతా రెండు వర్గాలుగా విడిపోయారు. అరుపులు , కేకలతో పుట్టిన రోజు పార్టీ దద్దరిల్లిపోయింది. అదే సమయంలో హఠాత్తుగా అంతా సైలెంట్ అయిపోయింది. కారణం.. రెండు సార్లు తుపాకీ కాల్పులు వినిపించడమే. పుట్టిన రోజు పార్టీకి తుపాకీ తెచ్చిన మనీ ధిల్లాన్ తనకు కేక్ పూసిన ఇద్దరు మిత్రుల్ని కాల్చి పడేశాడు. మనీష్ శర్మ, విక్రమ్ సేథ్‌లకు బుల్లెట్ గాయాలు కావడంతో అక్కడకక్కడే కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఇద్దరూ చనిపోయారు. 


పోలీసులు మనీ ధిల్లాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పుట్టినరోజు వేడుకకు హాజరైన యువకులందర్నీ పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. వారి కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వారి మధ్య పాత గొడవలు ఏమైనా ఉన్నాయా అనేది పరిశీలిస్తున్నారు. ఆ ఆయుధం ఎక్కడి నుంచి వచ్చింది.. లైసెన్స్ ఉందా .. ఉంటే ఎవరిది అనే వివరాలు ఆరా తీస్తున్నారు. ఎంత స్నేహితులైనా వారి దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో చూసుకుని వ్యవహరించాల్సి ఉంటుందని ఇలాంటి ఘటనలు నిరూపిస్తూ ఉంటాయి.