గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. దుండగులు వివాహితను హత్య చేసి వివస్త్రను చేశారు. సమాచారం అందుకున్న దుగ్గిరాల ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ఘటనాస్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.  


వీరంకి తిరుపతమ్మ, శ్రీనివాసరావు దంపతులు పంట పొలాలకు నీళ్లు పెట్టే పైపులు అద్దెకిస్తూ జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాసరావు తిరుపతి వెళ్లగా తిరుపతమ్మ ఒంటరిగా ఇంట్లో ఉంది. సాయంత్రానికి ఆమెను దుండగులు హత్య చేశారు. అంతే కాదు వివస్త్రను చేసి పడేశారు. 


ఇంట్లో పడి ఉన్న తిరుపతమ్మను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులతో కలిసి ఎస్ఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య చేసే సమయంలో తిరుపతమ్మ దుండగులతో పెనుగులాడినట్టు అర్థమవుతుందని, ఈ ఘటనపై ఉన్నతాధికారులకు తెలియజేశారు. క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. 


సామాజిక మాధ్యమాల్లో వచ్చినట్టు లైంగికదాడి అయితే జరగలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని చెప్పారు పోలీసులు. తిరుపతమ్మకు తెలిసిన వారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందనే దర్యాప్తు చేపట్టామని, ఘటనాస్థలంలో నిందితులు తాగి పడేసిన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ వివరించారు.


దుగ్గిరాల మండలంలో తుమ్మపూడిలో జరిగిన అత్యాచారం, హత్య కేసులో వీరంకి. శివరామకృష్ణ, మరీదు సాయి, కొర్రపాటి సాయి చరణ్ ప్రమేయం ఉందని ఆమె భర్త శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ ఘటనపైన దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో అనుమానితులు పేర్లు చెప్పారు. అయితే అనుమానితుల పేర్లు చెప్పొద్దు... అనుమానం కేసుగా నమోదు చేస్తామని పోలీసులు చెప్పారని శ్రీనివాస రావు ఆరోపించారు. 


ఈ కేసులో నిందితులకు ఓ పార్టీ నాయకుల అండ ఉందని ఆరోపిస్తున్నారు శ్రీనివాస రావు. వీళ్లంతా తెనాలి ఐతానగర్‌కు చెందిన వారిగా పేర్కొన్నారు. నిన్న ఉదయం నుంచి ఈ ముగ్గురు నిందితులు తమ ఇంటి సమీపంలో ఉన్న మద్యం షాపుల్లో విపరీతంగా మద్యం సేవించారని వివరించారు. పదే పదే లక్ష్మీతిరుపతమ్మకు ఫోన్ చేసి బెదిరించినట్లు ఆయన ఆరోపించారు. 


గత కొన్ని రోజుల నుంచి కూడా తన భార్యకు ఫోన్ ద్వారా వేధిస్తున్నారని తెలిపారు శ్రీనివాస్‌. గతంలో కూడా గొడవ జరిగినట్లు వివరించారు. తాను ఉపాధి కోసం తిరుపతిలో పనికి వెళ్లినట్లు తెలిపిన శ్రీనివాసరావు..తాను ఇంటి వద్ద లేనప్పుడు ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. తన భార్య ఒంటిపై బలమైన గాయాలు ఉన్నాయని అత్యాచారం జరిగిందని కచ్చితంగా నమ్ముతున్నట్లు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇప్పటికే పోలీస్ ప్రత్యేక బృందాలు వచ్చి క్లూస్ సేకరించినట్లు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతురాలి భర్త కోరుతున్నారు.