Mother Son Suiside :  అది కూకట్‌పల్లిలోని రిషి కల్యాణ్ రెసిడెన్సీ అపార్టుమెంట్ . ఒక్క సారిగా పోలీసులు బిలబిలమంటూ వచ్చారు. ఓ ఫ్లాట్‌ దగ్గరకు వెళ్లి ఫోర్స్‌గా తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. కానీ అక్కడున్న పరిస్థితి చూసి ముక్కులకు ఖర్చీఫ్ అడ్డం పెట్టుకుని బయటకు వచ్చేశారు.తలుపులు తీసిన తర్వాత ఆ ఆపార్టు మెంట్‌లో అందరి పరిస్థితి అదే. ఒకటే దుర్వాసన . అది మామూలు దుర్వాసన కాదు. మనిషి చనిపోయిన రెండు రోజుల తర్వాత వచ్చే దుర్వాసన. 


హైదరాబాద్‌ అపార్టుమెంట్‌లో ఉరి వేసుకున్న వరప్రసాద్ భార్య , కుమారుడు 


అసలేం జరిగిందంటే  విజయవాడలో వ్యాపారం చేసే వరప్రసాద్ భార్య కుమారుడితో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తూంటారు. ఆయన వ్యాపార పనుల నిమిత్తం ఎక్కువగా విజయవాడలో ఉంటూంటారు. హైదరాబాద్‌లో 59 ఏళ్ల భార్య సరళ, 35 ఏళ్ల కుమారుడు సందీప్ ఉంటూంటారు. అయితే గత రెండు రోజులుగా వారి నుంచి ఫోన్ రాలేదు. వరప్రసాద్ ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఏదో కీడు శంకించడంతో దగ్గర్లో ఉన్న బంధువులకు సమాచారం ఇచ్చారు. బంధువులు వచ్చి చూసే సరికి తలుపులు వేసి ఉన్నాయి. ఎన్ని సార్లు తలుపు కొట్టినా తీయలేదు సరి కదా లోపుల నుంచి దుర్వాసన వచ్చింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 


రెండు రోజుల కిందటే ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తింపు


కూకట్ పల్లి పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి చూస్తే... వరప్రసాద్ భార్య సరళ వంట గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించారు. బెడ్ రూమ్‌లో కుమారుడు సందీప్ కూడా అదే్ స్థితిలో ఆత్మహత్య చేసుకుని కనిపించారు. ఇంట్లో ఇంకా ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేకపోవడంతో ఆత్మహత్యలుగానే పోలీసులు భావిస్తున్నారు. రెండు రోజుల కిందటే ఆత్మహత్య చేసుకున్నట్లుగా తేలడంతో అసలు ఆ రోజేం జరిగిందన్నదానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. 


ఆత్మహత్యలకు కారణం ఏమిటి ? కుటుంబ కలహాలున్నాయా  ?


 విజయవాడ నుంచి వరప్రసాద్ వచ్చిన తర్వాత కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై కూపీ లాగి ఆత్మహత్య్ కు కారణాలు తెలుసుకునే అవకాశం ఉంది. అయితే ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకపోయినా... ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే చర్చ అపార్టుమెంట్ వాసుల్లో జరుగుతోంది. రెండు రోజుల నుంచి ఆత్మహత్య చేసుకున్నశవాలు అపార్టుమెంట్‌లోనే ఉన్నా సాధారణంగా గడిపేశామని చాలా మంది వణికిపోతున్నారు.