Minor Forceful Death In Nagarkurnool: ఈ రోజుల్లో పిల్లల దగ్గర నుంచి యువత, పెద్దల వరకూ చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భార్య వండిన కూర బాగాలేదని ఒకరు, గేమ్స్ ఆడొద్దన్నారని ఒకరు ఆత్మహత్యకు పాల్పడడం చూశాం. తాజాగా.. తనకు సినిమాకు వెళ్లేందుకు పేరెంట్స్ డబ్బులు ఇవ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈదమ్మ గుడి కాలనీకి చెందిన బాలుడు కార్తీక్. అతని తండ్రి గణేష్ దినసరి కూలీగా జీవనం సాగిస్తుండగా.. తల్లి సూపర్ మార్కెట్లో పని చేస్తూ ఉంటుంది.
అయితే, తల్లిదండ్రులు గుడికి వెళ్తున్న క్రమంలో కొడుకు కార్తీక్ సినిమాకు వెళ్లడానికి డబ్బులు అడగ్గా తండ్రి లేవని చెప్పి గుడికి వెళ్లిపోయారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కార్తీక్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుడి నుంచి వచ్చిన తల్లిదండ్రులు విగతజీవిగా ఉన్న కొడుకును చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.