ఫేస్‌బుక్ పరిచయం మరో యువతిని నిండా ముంచేసింది. ఆర్మీజవాన్ అంటూ పరిచయమైన వ్యక్తి ఆమెను దారుణంగా మోసం చేశాడు. పోలీసులకు బాధితురాలు తన గోడు చెప్పుకుంది. అక్కడ కూడా న్యాయం జరగడం లేదని వాపోతోందామె. 


వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. దోమ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువతికి రామకృష్ణ అనే ఆర్మీ జవాన్ ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. పరిచయం కాస్త గట్టి స్నేహంగా మారింది. చాలా రోజులు సరదాగా మాట్లాడిన రామకృష్ణ ఒకరోజు తన ప్రేమను వ్యక్తపరిచాడు. 


జవాన్‌ అని పరిచయం చేసుకున్న రామకృష్ణ... ప్రేమిస్తున్నానని చెప్పడంతో యువతి కూడా ఓకే చెప్పింది. చాలా మాటలు చెప్పాడు. ఆ మాయ మాటలు నమ్మేసిన యువతి అతను చెప్పిన వాటన్నింటికీ ఓకే అంది. కానీ రామకృష్ణ మనసులో ఉన్న మర్మాన్ని గ్రహించలేకపోయింది. 


నీకోసమే సెలవులకు వస్తున్నానని చెప్పిన రామకృష్ణ... ఓ రోజు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. షాక్ తిన్న యువతి ఏం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. వారం రోజులు ఇక్కడే ఉంటానని చెప్పిన రామకృష్ణ ఏం చూడాలంటే అది చూపిస్తానని... ఎక్కడ తిరగాలంటే అక్కడ తిప్పుతానని హామీ ఇచ్చాడు. 


ఎలాగో పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు కాబట్టి రామకృష్ణ చెప్పినట్టు చేసిందా యువతి. ఈ క్రమంలో తన కోర్కెలను కూడా తీర్చుకున్నాడు. ఆమె వద్దని చెబుతున్నా పెళ్లి పేరుతో ఆమెను లొంగతీసుకున్నట్టు బాధితురాలు చెబుతోంది. 


యువతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన బంధువులు ఆమెపై నిఘా పెట్టారు. సోమవారం రాత్రి కూడా వీళ్లిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు బంధువులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇలాంటి పనులు చేస్తున్న రామకృష్ణపై చేయి చేసుకోబోయారు. అయితే తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని కవర్ చేశాడు. 


రామకృష్ణ మాటలు నమ్మిన యువతి బంధువులు కూడా నిజమే అనుకున్నారు. ఆ క్షణానికి క్షేమంగా బయటపడ్డా రామకృష్ణ తర్వాత మాట మార్చాడు. యువతితో పెళ్లి సంగతి ఏంటి ఎప్పుడు చేసుకుంటావని అడితే ప్లేట్ ఫిరాయించాడు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని బుకాయించాడు. 


రామకృష్ణ ప్రవర్తనతో షాక్ తిన్న యువతి, ఆమె తరఫు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. తనకు జరిగిన మోసాన్ని పూసగుచ్చినట్టు యువతి పోలీసులకు చెప్పారు. ఫిర్యాదు కూడా అందజేసింది. అక్కడే వాళ్లకు మరో షాకింగ్ విషయం తెలిసింది. 


పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో రామకృష్ణ బంధువు ఒకరు పని చేస్తున్నారని తెలిసింది. అందుకే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయడానికి పోలీసులు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. కేసును తారుమారు చేసే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపిస్తున్నారు యువతి, ఆమె తరఫు బంధువులు. అన్యాయం జరిగిందని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగడం లేదని బాధితురాలు వాపోయారు.