Software Engineer Suicide in Hyderabad | హైదరాబాద్: పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు వివాహం ఎంతో మందికి శాపంగా మారుతోంది. వరకట్న వేధింపులతో కొందరు ఆత్మహత్య చేసుకుంటుంటే, తన భర్తనో, లేక భార్యనో వివాహేతర సంబంధాలు పెట్టుకుని వేధిస్తున్నారని కొందరు.. తమను మోసం చేశారని భరించలేక సైతం సూసైడ్ చేసుకుంటున్నారు. తమ రిలేషన్ కు అడ్డుగా ఉన్నారని తన భర్తను, భార్యను ప్లాన్ చేసి హత్య చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్‌లో అలాంటి ఘటన ఒకటి జరిగింది. భర్త వరకట్న వేధింపులు భరించలేక హైదరాబాద్ - రాయదుర్గం పీఎస్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

అసలేం జరిగిందంటే.. దేవిక (35), సతీష్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. ఆరు నెలల కిందట గోవాలో వీరి వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంతి హిల్స్ లో నివాసం ఉంటున్నారు. నగరంలోని ఓ మల్టీ నేషనల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో దేవిక, సతీష్ ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దేవిక తన ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దేవిక ఆత్మహత్యకు పాల్పడినట్టు సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో  గుర్తించాడు భర్త సతీష్. పోలీసులకు, దేవిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దేవిక ఆత్మహత్యకు భార్యాభర్తల మధ్య గొడవలే కారణమని దేవిక తల్లి రామలక్ష్మి పోలీసులకు తెలిపారు. భర్త వరకట్న వేధింపులతో తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం అల్లుడు తన కూతుర్ని వేధించేవాడని ఆమె వాపోయారు. దేవిక మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

పెళ్లయిన రెండు నెలల నుంచి తన కూతురికి వేధింపులు మొదలయ్యాయని, డిమాండ్ చేస్తే ఇల్లు కూడా రాసిచ్చామని తెలిపారు.   కానీ దేవికను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు అల్లుడు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని, మరో అమ్మాయికి ఇలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.