Rangareddy District Crime News: శంషాబాద్ పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం... గత కొద్ది రోజులుగా కొత్తూరు ప్రభుత్వ బడిలో విద్యార్థులు వింతగా ప్రవరిస్తున్నారని ఫిర్యాదు అందింది. వివరాలు సేకరిస్తే చాక్లెట్లు తిన్న తర్వాత నుంచి ఇది మొదలైందని ఉపాధ్యాయులు విద్యార్థులు చెప్పారు. దీనిపై ఆధారంగా కేసు రిజిస్టర్ చేసి చుట్టుపక్కల ఉన్న షాపుల్లో తనికీలు చేసిన పోలీసులకు షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి.
తనిఖీల్లో చాక్లెట్లు స్వాధీనం
ప్రభుత్వ పాఠశాలకు సమీపంలో ఉన్న దుకాణాలు, పాన్ డబ్బాలో తనిఖీలు చేపట్టారు. చార్మినార్ గోల్డ్ మునకా పేరుతో ఉన్న చాక్లెట్లు గుర్తించారు పోలీసులు. ఇందులో 42 చాక్లెట్లు ఉన్నాయి. పరీక్షలకు పంపిస్తే అందులో గంజాయి కలిసి ఉందని తేలింది. దీంతో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ చాక్లెట్ల ఖరీదు సుమారు లక్షన్నర ఉంటుందని అంచనా వేస్తున్నారు.
డబ్బు సంపాదన అక్రమ మార్గాలు
తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దురాశాతో కొందరు వ్యక్తులు చేసిన పనిగా పోలీసులు గుర్తించారు. ఒడిశాకు చెందిన ధీరేంద్రబహేరా కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడు. కొత్తూరు సమీపంలోనే ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు. వచ్చే జీతం ఖర్చులకు సరిపోవడం లేదని అడ్డదారుల్లో సంపాదనకు అలవాటు పడ్డాడు.
ఒడిశా గ్యాంగ్ అరెస్టు
ఒడిశాకే చెందిన సోమ్‌నాథ్ బెహ్రేన్, సూర్యమనిసాహూతో కలిసి ధీరేంద్రబహేరా చాక్లెట్ల వ్యాపారం మొదలు పెట్టారు. చార్మినార్ గోల్డ్ మునకా పేరుతో ఉన్న చాక్లెట్లను ఇవ్వడం మొదలు పెట్టారు. నార్మల్‌గా అమ్మితే పోలీసులకు చిక్కుతామని గ్రహించిన ఈ గ్యాంగ్ స్కూల్స్‌ను టార్గెట్ చేసింది. ముందుగా ప్రభుత్వ పాఠశాలను ఎంచుకున్నారు.
విద్యార్థులతో మొదలై కార్మికుల వరకు
ముందుగా విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చి మచ్చిక చేసుకుంటారు. తర్వాత వాళ్లు తీసుకొచ్చిన చాక్లెట్లు ఫ్రీగా ఇచ్చారు. కాల క్రమేనే వాటిని అమ్మడం మొదలు పెట్టారు. ఒకసారి అలవాటు పడిన విద్యార్థులు పదే పదే అడిగేవాళ్లు ఇలా అడిగేవాళ్లకు ఒక్కో చాక్లెట్ 20 రూపాయలకు అమ్మేవాళ్లు. ఈ చాక్లెట్లను స్థానికంగా వివిధ కంపెనీల్లో పని చేసే కార్మికులకి కూడా అలవాటు చేశారు.
విద్యార్థుల వింత ప్రవర్తనతో వెలుగులోకి
చాక్లెట్లను విద్యార్థులకు, కార్మికులకు అలవాటు చేసిన ఈ గ్యాంగ్ క్రమంగా వ్యాపారాన్ని విస్తరించింది. స్కూల్, పరిశ్రమల సమీపంలోని పాన్ డబ్బాలతోపాటు కిరాణ దుకాణాలకి కూడా విక్రయించడం స్టార్ట్ చేసింది. అయితే కొత్తూరులో కొందరు విద్యార్థులు ఈ చాక్లెట్లు తిని వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. గత కొన్ని రోజులుగా విద్యార్థుల ప్రవర్తనలో మార్పు గమనించిన ఉపాధ్యాయులకు అసలు విషయం ఆలస్యంగా తెలిసింది. విద్యార్థులు తినే చాక్లెట్లు పరిశీలిస్తే వాళ్లకు ఏదో అనుమానం కలిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఈ గ్యాంగ్ విక్రయించే చాక్లెట్లు చూస్తే అందులో ఉత్తర్‌ప్రదేశ్ అడ్రెస్ఉంది. వీటిని ఎలా తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. వీళ్లేనా ఇంకా ఎవరైనా ఈ ముఠాలో ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి చాక్లెట్లు కానీ ఇతర పదార్థాలు కానీ అమ్ముతున్నట్టు అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.