Lady Arrested in Cheating Case | హైదరాబాద్: గత కొన్నేళ్లుగా ఉద్యోగాల పేరుతో, హోదా పేరుతో మోసాలు చేయడం కేటుగాళ్లకు అలవాటు అయింది. ఏదో రూపంలో మోసాలు చేసి కోట్లు వసూలు చేసి పబ్బం గడుపుకుంటున్నారు. దాంతో అమాయకులు లక్షలు పోగొట్టుకుని రోడ్డున పడుతున్నారు. కొందరైతే తాము మోసపోయామంటూ సెల్ఫీ వీడియో తీసి ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా హైకోర్టు జడ్జిని అంటూ మాయమాటలు చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఓ కిలేడీని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైకోర్టులో జాబ్స్ అని యువకులను నమ్మించి వసూళ్లు

ప్రసన్న రెడ్డి అనే మహిళ తాను హైకోర్టు జడ్జిని అని ప్రచారం చేసుకుంది. ఉద్యోగాల అవసరం ఉన్న యువకులను ఆమె టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడింది. హైకోర్ట్ లో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని 100 మందికి పైగా యువకులను నమ్మించి, వారి వద్ద నుంచి లక్షల రూపాలు వసూలు చేసింది. ఓవరాల్ గా కోట్ల రూపాయలు వసూలు చేసింది కానీ యువకులకు ఉద్యోగాలు ఇప్పించలేదు. దాంతో తాము మోసపోయామని గ్రహించిన యువకులు పలు పోలీస్ స్టేషన్లలో ప్రసన్న రెడ్డిపై ఫిర్యాదు చేశారు. తాను హైకోర్టు జడ్జినని నమ్మించి, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి తమ నుంచి లక్షల్లో వసూలు చేసిందని ఫిర్యాదులలో పేర్కొన్నారు. 

పోలీసులను సైతం బురిడీ కొట్టించిన కిలేడీ100 మందికి పైగా అమాయకుల్ని హైకోర్టులో ఉద్యోగాలు, నేవీ, డిఫెన్స్ జాబ్స్ ఇప్పిస్తానని మోసం చేసిన కిలాడి ప్రసన్న రెడ్డి పోలీసులను సైతం మోసం చేసింది. జడ్జినని సీఐని నమ్మించి వేములవాడ దేవాలయంలో ప్రత్యేక దర్శనం సైతం చేసుకుందని ఆమెపై ఆరోపణలున్నాయి. ఆమెపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు కరీంనగర్‌లో నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.